ఓర్వలేకే కాంగ్రెస్ దాడులు.. బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి

ఓర్వలేకే కాంగ్రెస్ దాడులు..  బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రధాని మోదీ ప్రభంజనాన్ని, బీజేపీ విజయాలను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపిందని బీజేపీ కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల ఇన్​చార్జ్​ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ సర్కారు వైఫల్యాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ఆఫీసుల ముట్టడికి  ప్లాన్ చేశారని ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బీజేపీ స్టేట్​ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. మోదీ సీఎంగా ఉన్నప్పుడు, అమిత్ షా రాష్ట్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసులతో వేధించిందని పొంగులేటి ఆరోపించారు. 

అయినా వారు విచారణకు సహకరించారే తప్ప కాంగ్రెస్ ఆఫీసులపై దాడులు చేయించలేదన్నారు. తీర్పులు అనుకూలంగా వస్తే న్యాయవ్యవస్థ గొప్పదని, లేకపోతే ఈడీ, సీబీఐ, మోదీపై బురద జల్లడం కాంగ్రెస్ నేతలకు ఫ్యాషన్​ అయిపోయిందన్నారు. గాంధీ పేరును ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌గా వాడుకోవడమే తప్ప, ఆ కుటుంబంపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు గౌరవం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అయ్యిందని సుధాకర్ రెడ్డి విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీన్ మారిందని, కేరళ, కర్నాటక, తమిళనాడు సహా పుదుచ్చేరిలో రాబోయే రోజుల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైన విజయాలు సాధించబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు.