హైదరాబాద్, వెలుగు: సీనియర్ నేషనల్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఏపీ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ గోల్డ్ మెడల్‌తో మెరిశాడు. హైదరాబాద్ బేగంపేట్ పబ్లిక్ స్కూల్‌లో గురువారం జరిగిన మెన్స్ రికర్వ్ ఒలింపిక్ రౌండ్‌లో ధీరజ్ (ఎస్‌ఎస్‌సీ)బీ 6-–0 తేడాతో మహారాష్ట్రకు చెందిన పార్థ్ సుశాంత్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు.
70 మీటర్ల ఓవరాల్ విభాగంలో వెటరన్ ఆర్చర్ అటాను దాస్ (పీఎస్‌పీబీ) 684 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా, తరుణ్‌దీప్ రాయ్ (సిక్కిం) రజతంతో సరిపెట్టుకున్నాడు. విమెన్స్ రికర్వ్ ఒలింపిక్ రౌండ్ ఫైనల్లో మహారాష్ట్ర ఆర్చర్ శ్రవరి సోమనాథ్ షెండే 6-–2 తో బిహార్‌కు చెందిన అన్షిక కుమారిపై గెలిచి స్వర్ణం అందుకోగా.. 70 మీటర్ల ఓవరాల్ కేటగిరీలో మహారాష్ట్రకే చెందిన గాథా ఆనందరావు 673 పాయింట్లతో గోల్డ్ గెలిచింది. స్టార్ ఆర్చర్ దీపికా కుమారి 668 పాయింట్లతో సిల్వర్‌తో సరిపెట్టింది. విజేతలకు ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రెసిడెంట్ అర్జున్ ముందా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్‌తో కలిసి మెడల్స్ అందజేశారు.
