- ముగ్గురు మావోయిస్టులు మృతి
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గొందిగూడెం అడవుల్లో గురువారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నారు. ఎస్పీ కిరణ్ చౌహాన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. సుక్మా జిల్లా గొల్లపల్లి అడవుల్లో కిష్టారం, కుంట ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు సమావేశమయ్యారని, బలగాలపై దాడులకు వ్యూహం పన్నుతున్నారన్న సమాచారంతో డీఆర్జీ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. గాలింపు చేపట్టిన డీఆర్జీ బలగాలపై మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. తేరుకున్న డీఆర్జీ బలగాలు ప్రతిదాడికి దిగాయి. ఇరు వర్గాల మధ్య కొన్ని గంటలపాటు కాల్పులు జరిగాయి. ఫైరింగ్ చేసుకుంటూనే మావోయిస్టులు తప్పించుకుని అడవుల్లోకి పారిపోయారు.
కొందరు గాయపడ్డారు. కాల్పుల అనంతరం వివిధ ప్రదేశాల్లో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు దొరికాయి. మృతులను కుంట ఏరియా కమిటీ సభ్యుడు మడవి జోగా, కిష్టారం ఏరియా కమిటీ సభ్యుడు బండి సోడి, కిష్టారం లోకల్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యురాలు నుప్పోం బజనిగా గుర్తించారు. వీరిలో జోగా, సోడిలపై రూ.5 లక్షల చొప్పున, బజనిపై రూ.2 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలంలో 9ఎంఎం సర్వీస్ పిస్టల్, 12 బోర్ తుపాకీ, బర్మార్ తుపాకులతో పాటు భారీ సంఖ్యలో పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం, నిత్యావసర సరుకులను స్వాధీనం చేసుకుని సుక్మా జిల్లా కేంద్రానికి తరలించారు. ఇక ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లలో 255 మంది మావోయిస్టులు మరణించారని ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు.
