న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రౌండ్లో భాగంగా ఇండియా, సౌతాఫ్రికా తలపడనున్నాయి. 2026, ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి సెమీస్‌కు లైన్ క్లియర్ చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా బలహీనతలపై సౌతాఫ్రికా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఫామ్‌లేమితో సతమతమవుతోన్న టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మను పవర్ ప్లేలోనే ఔట్ చేసేందుకు ప్రొటిస్ జట్టు వ్యూహాం పన్నుతోంది.
ఈ వరల్డ్ కప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత యువ ఓపెనర్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. గ్రూప్ స్టేజ్‌లో మూడు మ్యాచులు ఆడి మూడింట్లో డకౌట్ అయ్యి తీవ్రంగా నిరాశ పర్చాడు. ముఖ్యంగా స్పిన్‌ను ఎదుర్కొవడంలో అభి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు. మూడు మ్యాచుల్లో స్పిన్ బౌలింగ్‌లోనే ఔట్ కావడం అతడి బలహీనతను బయటపెడుతోంది. ఈ విషయాన్ని గమనించిన దాయాది పాకిస్తాన్ జట్టు ఇదే స్పిన్ వ్యూహాంతో అభిషేక్ శర్మను బోల్తా కొట్టించింది.
గ్రూప్ దశలో ఇండియా, పాక్ మధ్య జరిగిన హైఓల్టేజ్ పోరులో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా తొలి ఓవర్లలోనే అభిషేక్‌ను ఔట్ చేశాడు. షాహీన్ అఫ్రీది వంటి ప్రపంచస్థాయి ఫాస్ట్ బౌలర్‌ను కూడా పక్కన పెట్టి స్వయంగా సల్మాన్ అఘానే ఫస్ట్ ఓవర్ వేశాడు. ఇందుకు ప్రధాన కారణం అభి స్పిన్‌ను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడటమే. అనుకున్నట్లుగానే పాకిస్తాన్ ప్లాన్ వర్కౌట్ అయ్యింది. సల్మాన్ అఘా బౌలింగ్‌లో అభి ఫస్ట్ ఓవర్లోనే క్యాచ్ ఔట్ పెవిలియన్ బాట్ పట్టాడు.
సూపర్ 8కు ముందు సౌతాఫ్రికా కూడా పాకిస్తాన్ వ్యూహాన్నే అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. అభిషేక్‌పై స్పిన్ మంత్రం ప్రయోగించాలని ప్రొటిస్ కెప్టెన్ మార్క్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. సేమ్ సల్మాన్ అఘా మాదిరిగానే తాను స్పిన్ బౌలింగ్ వేసి పవర్ ప్లేలోనే డేంజరస్ అభిషేక్ శర్మను ఔట్ చేయాలని మార్క్రమ్ వ్యూహాం రచించినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే మార్క్రమ్ ప్రాక్టీస్ సెషన్లో లెఫ్టార్మ్ బ్యాటర్లకు స్నిన్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. అభిని క్లీన్ బౌల్డ్ చేసిన నెదర్లాండ్స్ బౌలర్ ఆర్యన్ దత్ బౌలింగ్ శైలీని మార్క్రమ్ తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. మరో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ కూడా నెట్స్‌లో కఠినంగా శిక్షణ పొందాడు. దీంతో భారత ఓపెనర్లను దెబ్బకొట్టేందుకు స్పిన్ అస్త్రాన్నే ప్రయోగించాలని సౌతాఫ్రికా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
