గోదావరిలో నీళ్లు ఉన్నా దేవాదుల మోటార్లు ఆన్ చేయడం లేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. దేవన్న పేట పంప్ హౌస్ ను సందర్శించిన హరీశ్.. గతంలో జిల్లా మంత్రులు ఇక్కడ హడావిడి చేశారని చెప్పారు. గతంలో ఇక్కడి మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల 60 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఇక్కడ పంపింగ్ ఆగిపోవడం వల్ల జనగామ, స్టేషన్ ఘన్ పూర్,పాలకుర్తి రైతాంగానికి ఇబ్బందులు వచ్చాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచినా దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు హరీశ్ రావు . ఇక్కడ ఉన్న మోటార్లు కూడా నడపడం కాంగ్రెస్ వల్ల కావడం లేదన్నారు. కాంగ్రెస్ తీరుతో రైతుల ఇబ్బందులు తప్పడం లేదన్నారు. తాము ప్రాజెక్టులు నిర్మిస్తే కాంగ్రెస్ వాటిని నిర్వహించలేకపోతోందన్నారు. దేవాదుల మీద కాంగ్రెస్ కనీసం రూ. 200 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. ఈ ప్రాజెక్ట్ పై బీఆర్ఎస్ రూ. 7300 కోట్లు ఖర్చుచేసిందన్నారు.
ఏపీ నల్లమల్ల సాగర్ కడుతుంటే సీఎం రేవంత్ మౌనంగా ఉన్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని ఆరోపించారు. గోదావరిలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంతో కాంగ్రెస్ విఫలం అయిందన్నారు. కృష్ణాలో మన నీటి వాటాను వాడుకోలేకపోతున్నారని విమర్శించారు.ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే అడ్డుకోలేకపోతున్నారని అన్నారు. ఎప్పటికపుడు రైతుబంధూ అంటూ రేవంత్ రైతులను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు హరీశ్ రావు.
