T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లోని సూపర్-8 ఫార్మాట్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటుంది. ప్రీ-సీడింగ్ విధానంతో టోర్నీలో అసమతుల్యత ఏర్పడిందని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. మరి.. ప్రీ-సీడింగ్ విధానం విషయంలో ఐసీసీపై క్రీడా వర్గాలు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేయడానికి గల ప్రధాన కారణం ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా ఏదైనా టోర్నమెంట్లో గ్రూప్ స్టేజ్ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన టీమ్స్ ని నెక్ట్స్ రౌండ్ లో కాస్త ఉపశమనం కలిగించేలా సీడింగ్ విధానం అమలు చేస్తుంటారు. ఈసారి మాత్రం ఐసీసీ టీ20 ప్రపంచ కప్-2026 టోర్నమెంట్ ప్రారంభం కాకముందే.. ఏ టీమ్ ఏ గ్రూపులో ఉండాలో ఫిక్స్ చేసేసింది. మెగా టోర్నీ స్టార్ట్ కాకముందే సీడింగ్ చేయడంతో దీన్ని ప్రీ-సీడింగ్ అని పిలుస్తుంటారు. దీని అర్థం ఏంటంటే.. ఒక టీమ్ తన గ్రూపులో మొదటి స్థానంలో నిలిచినా, సెకండ్ ప్లేస్ లో నిలిచినా... ముందుగా అనుకున్న స్లాట్‌లోనే ఉంటుంది.
ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గ్రూప్ స్టేజ్‌లో లీగ్ టాపర్స్ గా నిలిచిన టీమిండియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, జింబాబ్వే టీమ్స్.. సూపర్ 8లో ఒకే గ్రూపులో ఉండగా, మరోవైపు రెండో స్థానంలో నిలిచిన పాక్, శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు ఇంకో దాంట్లో ( గ్రూప్-2) ఉన్నాయి. ఈ విధానమే ప్రస్తుతం క్రికెట్ అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకుల నుంచి ఐసీసీ విమర్శలు ఎదుర్కొనేలా చేస్తుంది.
ఈ విధానంతో గ్రూప్ స్టేజ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన 4 టీమ్స్ లో రెండు జట్లు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో గ్రూప్ స్టేజ్‌లో రెండో స్థానంలో ఉన్న రెండు జట్లకు సెమీస్‌కు చేరడం ఈజీ కానుంది. ఇది టాపర్లుగా నిలిచిన టీమ్స్ కు అన్యాయం చేసినట్లేనని.. ప్రతిభను గౌరవించేలా ఐసీసీ నిర్ణయం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సూపర్-8 ఫార్మాట్ విధానంపై వస్తున్న విమర్శలపై ఐసీసీ రియాక్ట్ అయింది. ఈ మెగా టోర్నీని భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.. రవాణా, భద్రత, బ్రాడ్‌కాస్టింగ్ షెడ్యూల్‌కు సంబంధించి ముందుగానే షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం కోసమే ఇలా చేశామని తేల్చి చెప్పింది. వేల సంఖ్యలో ప్రయాణించే ఫ్యాన్స్, మీడియాకు ఇబ్బంది కలగకుండా ఏ జట్టు ఎక్కడ ఆడుతుందో ముందే తెలిస్తే ఈజీగా ఉంటుందని ఐసీసీ ప్రీ-సీడింగ్ విధానాన్ని సమర్థించుకుంది.
