V6 News

Actor Eric Dane: 53 ఏళ్లకే ప్రముఖ నటుడు మృతి.. ఎలా చనిపోయాడంటే?

Actor Eric Dane: 53 ఏళ్లకే ప్రముఖ నటుడు మృతి.. ఎలా చనిపోయాడంటే?

ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ ఎరిక్ డేన్ (Eric Dane) కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ALS) వ్యాధితో బాధపడుతూ గురువారం (2026 ఫిబ్రవరి 19న) తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

“భారీ మనసుతో తెలియజేస్తున్నాం.. ఎరిక్ డేన్ ALSతో ధైర్యంగా పోరాడుతూ గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు,” అని ఆయన కుటుంబం ప్రతినిధి ద్వారా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఎరిక్ డేన్ మృతితో హాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అభిమానులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. 

ఎరిక్ డేన్ అమెరికన్ టీవీ సిరీస్ Grey's Anatomy లో డాక్టర్ మార్క్ “McSteamy” స్లోన్ పాత్రతో విశేష గుర్తింపు పొందారు. ఓ సన్నివేశంలో షవర్ నుంచి తువాలు కప్పుకుని బయటకు వచ్చే ఎంట్రీతో ఆయన కెరీర్ ఒక్కసారిగా పుంజుకుంది.

అనంతరం The Last Ship, అలాగే Euphoria వంటి ప్రముఖ సిరీస్‌లలో కూడా నటించి అభిమానులను సంపాదించారు. అంతేకాకుండా నటుడు ఎరిక్ డేన్.. X-Men, వాలెంటైన్స్ డే బ్యాడ్ బాయ్స్, మార్లీ & మీ వంటి తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు.

ఇకపోతే, ALS అనేది కండరాలను నియంత్రించే నరాలు నశించిపోయే వ్యాధి. దీనివల్ల కండరాలు బలహీనపడి, కాలక్రమేణా పక్షవాతానికి దారితీస్తాయి. ఇదొక ప్రాణాంతక నాడీ సంబంధిత రుగ్మత మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు దారితీస్తుంది.