- బీఆర్‌ఎస్‌ను వదిలాక నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా
- పార్టీ మారిన నేతలు నైతికత పాటించాలి : ఎమ్మెల్సీ కవిత
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీర్పు దారుణంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జనం బాట పోగ్రాంలో భాగంగా గురువారం భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం సత్యనారాయణపురంలో పర్యటించారు. ముందుగా సత్యనారాయణపురంలోని హజ్రత్ నాగుల్‌మీరా చిల్లాలో ప్రార్థనలు చేసిన అనంతరం కొత్తగూడెంలోని మార్కెట్ ఏరియాలో జాగృతి జెండాను ఎగురవేశారు.
అనాథాశ్రమం, ప్రభుత్వ హాస్పిటల్‌ను సందర్శించారు. పాల్వంచలోని పెద్దమ్మతల్లి టెంపుల్‌లో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారారని అందరికీ తెలుసు.. కానీ ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొనడం విచారకరం అన్నారు. పార్టీ మారిన నేతలు కచ్చితంగా నైతికత పాటించాలని సూచించారు. ఆ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కాపాడుతోందన్నారు. బీఆర్‌ఎస్‌ను వీడిన తర్వాత తాను పదవికి రాజీనామా చేసినా.. మండలి చైర్మన్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని, రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్‌లను కేంద్రం ప్రైవేట్‌కు అప్పగిస్తోందని ఆరోపించారు. సింగరేణి పరిధిలోని కోల్ బ్లాక్‌లను ఆ సంస్థకే ఇవ్వాలని, డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు. కొత్తగూడెంలో 750 బెడ్స్‌తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించేలా మంత్రులు కృషి చేయాలన్నారు. ఆమె వెంట జాగృతి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి, జాగృతి నేతలు నవీన్‌చారి, జగదీశ్, క్రాంతి, సురేశ్ పాల్గొన్నారు.
