హైదరాబాద్ లింగంపల్లిలో షార్ట్ సర్క్యూట్ తో కాలి బూడిదైన కార్మికుల షెడ్లు

హైదరాబాద్ లింగంపల్లిలో షార్ట్ సర్క్యూట్ తో కాలి బూడిదైన కార్మికుల షెడ్లు
  • అందరూ భవన పనుల్లో ఉండటంతో తప్పిన ప్రాణాపాయం
  • లింగంపల్లిలో ఘటన

చందానగర్, వెలుగు: షార్ట్ సర్క్యూట్​తో భవన నిర్మాణ కార్మికులు నివాసం ఉండే షెడ్లు కాలిబూడిదయ్యాయి. ఆ సమయంలో అందరూ భవన పనుల్లో ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లిలో భారీ భవనం నిర్మిస్తున్నారు. ఇక్కడ పని చేసే కార్మికులు అపార్ట్​మెంట్ పక్కనే షెడ్లలో నివాసం ఉంటున్నారు. గురువారం అందరూ పనుల్లో ఉండగా.. షార్ట్​సర్క్యూట్​జరిగి, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షెడ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. 

నిర్మాణ సంస్థ క్యాండూర్​ఉద్యోగుల సమాచారంతో మాదాపూర్, పటాన్​చెరు  ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని, 3 గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో కార్మికులకు సంబంధించిన సామగ్రి పూర్తిగా కాలిపోయింది. క్యాండూర్ నిర్మాణ సంస్థ తమ వద్ద పని చేస్తున్న కార్మికుల సేఫ్టీని గాలికొదిలేసిందని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఒకేచోట రేకుల షెడ్లను నిర్మించి, వందలాది మందిని ఇరుకు గదుల్లో ఉంచిందన్నారు. ఇటీవల చందానగర్ లో కార్మికుల షెడ్లు కాలిబూడిదైన ఘటన మరువకముందే మరో సంఘటన చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. ప్రాణ నష్టం జరిగితే తప్ప అధికారులు నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోరంటూ మండిపడ్డారు.