- కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు : నగరంలో ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను బయో మైనింగ్ విధానంలో కంపోస్టు ఎరువుగా మార్చే ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. గురువారం ఆయన నగరంలోని నారాగంలోగల డంపింగ్ యార్డ్ విజిట్ చేసి బయో మైనింగ్ జరుగుతున్న తీరు పరిశీలించి మాట్లాడారు. ఇందుకోసం ఇప్పుడు వినియోగిస్తున్న యంత్రాలతో పాటు మరో రెండు వేస్టేజ్ ప్రాసెసింగ్ మెషిన్స్ తెప్పించి కాంట్రాక్ట్ ఏజెన్సీకి అప్పగించాలన్నారు.
బయో మైనింగ్‌తో ఉత్పత్తి చేసిన కంపోస్టు ఎవరికి సప్లయ్ చేస్తున్నారో తెలుసుకున్నారు. అంతకు ముందు ఎల్లమ్మగుట్ట, రైల్వే కమాన్, గాయత్రీనగర్ ప్రధాన కూడళ్లు చెక్ చేశారు. రోడ్లపై చెత్తను పారేయకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని, ఉల్లఘించే వారికి విధించే జరిమానాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేరువేరుగా వాహనాల్లో సేకరించాలని, డ్రైనేజీ క్లీనింగ్‌కు జేసీబీలు వినియోగించాలని, గ్రీనరీ పెంపునకు విరివిగా మొక్కలు పెంచాలని కోరారు. నగర పాలక కమిషనర్ దిలీప్‌కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, ఇన్చార్జి ఎంహెచ్వో సాజిద్ తదితరులు ఉన్నారు.
