డీజీపీ నియామక ఉత్తర్వులపై స్టేకు హైకోర్టు నో..విచారణ డిసెంబర్ 22కి వాయిదా

డీజీపీ నియామక ఉత్తర్వులపై స్టేకు హైకోర్టు నో..విచారణ డిసెంబర్ 22కి వాయిదా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర డీజీపీగా బి.శివధర్‌‌రెడ్డి నియామకాన్ని సవాల్‌‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌లో మధ్యంతర స్టే ఆదేశాల జారీకి హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌‌లైన్స్‌‌కు లోబడి డీజీపీ నియామకంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. విచారణను ఈ నెల22కి వాయిదా వేసింది. డీజీపీగా శివధర్‌‌రెడ్డి నియామకాన్ని సవాల్‌‌ చేస్తూ హైదరాబాద్‌‌కు చెందిన సోషల్‌‌ వర్కర్‌‌ టి.ధన్‌‌గోపాల్‌‌ రావు దాఖలు చేసిన పిటిషన్‌‌ను గురువారం జస్టిస్‌‌ పుల్లా కార్తీక్‌‌ విచారించారు. 

ఈ ఏడాది సెప్టెంబర్‌‌ 2025న ప్రభుత్వం జారీ చేసిన డీజీపీ నియామక ఉత్తర్వులు 2018లో సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌‌లైన్స్‌‌కు వ్యతిరేకమని పిటిషనర్‌‌ వ్యక్తిగతంగా హాజరై, వాదించారు. డీజీపీ పదవీ విరమణకు కనీసం 3 నెలల ముందుగానే యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వాలు డీజీపీ భర్తీకి వివరాలు సమర్పించాలన్నారు. అర్హులైన ఐపీఎస్‌‌ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిలయ్యిందని చెప్పారు. 

దీంతో శాశ్వత నియామక ప్రక్రియ ఆగిందని చెప్పారు.  దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌‌ జనరల్‌‌ సుదర్శన్‌‌రెడ్డి వాదిస్తుండగా.. పిటిషనర్‌‌ కల్పించుకుని మధ్యంతర స్టే ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు.