గొర్రెల మందపై దూసుకెళ్లిన బొలెరో 11 మృతి, 20 గొర్రెలకు గాయాలు

గొర్రెల మందపై  దూసుకెళ్లిన బొలెరో 11 మృతి, 20 గొర్రెలకు గాయాలు

హాలియా, వెలుగు: రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందకి బొలెరో దూసుకెళ్లింది. ఈ ఘటన నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఈశ్వర్​నగర్​ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. ఎస్ఐ సాయి ప్రశాంత్​కథనం ప్రకారం..  తిరుమలగిరి గ్రామానికి చెందిన బొమ్ము కొండలు, అదే గ్రామానికి చెందిన వడ్లమాను సాయి సురేశ్ గొర్రెలను మేపుకుంటూ  కోదాడ- జడ్చర్ల 167 వ జాతీయ ప్రధాన రహదారిపై తెల్లవారుజామున పెద్దగూడెం స్టేజ్ వైపు వెళ్తున్నారు. పెద్దవూర వైపు నుంచి హాలియా వైపు వస్తున్న బొలెరో వేగంగా గొర్రెల మందను ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో 11 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా 20 గొర్రెలకు గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన బొలెరో డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పారిపోయినట్లు గొర్రెల యజమానులు తెలిపారు. సుమారు రూ. 2 లక్షలు నష్టం వాటిల్లినట్లు గొర్రెల కాపరులు చెప్పారు. విషయం తెలుసుకున్న గొర్రెల కాపరుల సంఘం అనుముల మండల అధ్యక్షుడు గౌని రాజా రమేశ్ యాదవ్, సంఘం సభ్యులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని హాలియా పోలీసులకు సమాచారం అందించారు. నిర్లక్ష్యంగా నడిపిన బొలెరో డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరారు. ఘటనపై హాలియా పోలీస్ స్టేషన్‌‌లో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న వాహనం, డ్రైవర్‌‌ను గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్‌‌ఐ ప్రశాంత్​ తెలిపారు.