హుస్నాబాద్, వెలుగు: ఉత్తర తెలంగాణలోనే హుస్నాబాద్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఆయన స్కూటీపై పట్టణంలోని గల్లీల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై స్థానికులతో చర్చించారు. ఎల్లవ్వ అనే మహిళ తనకు ఉండేందుకు వసతి లేదని మంత్రి దృష్టికి తీసుకురాగా అధికారులతో మాట్లాడి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు. బుడిగజంగాల కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
అనభేరి జంక్షన్‌ను సుందరీకరించి విగ్రహ ఏర్పాటు చేయాలని, అంబేద్కర్ జంక్షన్, మల్లె చెట్టు చౌరస్తాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. హుస్నాబాద్ లోని ఆర్టీసీ డిపోకు రూ.70 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. రెడ్డి, మున్నూరు కాపు, యాదవ, గౌడ, పద్మశాలి సంఘాల కమ్యూనిటీ హాళ్లను, బంజారా భవన్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించి, సమ్మక్క గద్దెల వద్ద సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, ఫ్యాక్స్ చైర్మన్ శివయ్య, నాయకులు రవీందర్, పద్మ, శ్రీనివాస్, వెంకట రమణ, సది, రాజు, హాసన్, సరోజన, కిష్టస్వామి ఉన్నారు.
మంత్రిని కలిసిన నూతన సర్పంచులు
కోహెడ: కోహెడ మండలంలో కాంగ్రెస్ నూతన సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించి శాలువాలతో సత్కరించారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
