బెల్లంపల్లి, వెలుగు : అందరం కలిసి ప్రజల కోసం పనిచేద్దామని ఎమ్మెల్యే గడ్డం వినోద్అన్నారు. గురువారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ముఖ్యం కాదని, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అభివృద్ధి చేయాలన్నారు. తాను ఎవరితోనైనా మాట్లాడి అభివృద్ధి పనులకు నిధులు తెప్పించే సత్తా ఉన్న ఎమ్మెల్యేనని తెలిపారు.
మీరంతా ఏది అడిగినా ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడి ఆ పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నియోజకవర్గంలోని బెల్లంపల్లి, తాండూరు, వేమనపల్లి, భీమిని, కన్నెపల్లి, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో గెలిచిన కాంగ్రెస్సర్పంచులను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు పి.రఘునాథ్‌రెడ్డి, నాయకులు కారుకూరి రాంచందర్, ముచ్చర్ల మల్లయ్య, నాతరి స్వామి, ఎం.నర్సింగారావు, ఆర్.సంతోష్‌కుమార్, ఎండీ ఆసా, ఎస్.శంకర్, హరీశ్ గౌడ్ పాల్గొన్నారు.
