సైబర్ మోసాల గురించి వినే ఉంటారు.. చూసే ఉంటారు.. కానీ గత కొన్నేళ్ల నుండి చూస్తే ప్రస్తుతం సైబర్ మోసాలు భారీగా పెరిగిపోయాయి. ప్రభుత్వం దీన్ని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్న కొత్త కొత్త పద్ధతుల్లో పుట్టుకొస్తూనే ఉంది. ఈ సైబర్ మోసాలు వల్ల ఎంతో మంది లక్షల పోగొట్టుకోగా... చాల మంది ప్రాణాలు వదిలారు. అయితే కొన్ని సైబర్ మోసాలు ఎక్కువగా డబ్బులు ఆశ చూపి భారతీయులను టార్గెట్ చేస్తున్నాయి. వీటి నుండి తప్పించుకోవడం ఎలా... అసలు సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి... మన దేశంలో ఎక్కువగా ఎలాంటి సైబర్ మోసాలు జనాలను పీడిస్తున్నాయో తెలుసా .........
1. పెట్టుబడి & బెట్టింగ్ మోసాలు
ముందుగా మీకు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లేదా ఏదైనా యాప్ లో మెసేజ్ చేస్తారు. బెట్టింగ్ యాప్‌లో లేదా ఇన్వెస్ట్మెంట్స్ లో కొంచెం డబ్బు పెట్టుబడి పెడితే డబుల్ లాభం వస్తుంది అని ఆశ చూపిస్తారు. మొదట్లో మీరు తక్కువ డబ్బు పెట్టినప్పుడు మీకు లాభం వచ్చేటట్లు చేసి నమ్మిస్తారు. తరువాత అది చూసి మీరు ఎక్కువ మొత్తం పెట్టగానే, ఆ యాప్ లేదా వెబ్‌సైట్ పనిచేయదు. మీ డబ్బుతో వారు మాయమైపోతారు. మోసగాళ్ళు చేసే అత్యంత సాధారణ స్కామ్‌లలో ఇది ఒకటి.
2. జాబ్ ఆఫర్ మోసాలు
ఈ రకమైన స్కామ్‌లో మోసగాళ్ళు మంచి జీతం ఇస్తామని నమ్మిస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ ఆఫర్ పేరుతో మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు, సేజ్‌లు పంపుతారు. జీతం బాగుంది ఇంకా ఇంటి నుండే చేయొచ్చు అని చాలా మంది దీని నిజనేమో అని ఆకర్షితులవుతారు. తరువాత మీ పర్సనల్ వివరాలు, రిజిస్ట్రేషన్ ఫీజు అని, ట్రైనింగ్ ఫీజు అని ముందే డబ్బులు కట్టించుకుంటారు. డబ్బులు కట్టాక వాళ్లు మీకు ఇక దొరక్కుండా మాయమైపోతారు.
3. అధికారులమని నమ్మించి మోసం
మీ ఆఫీస్ బాస్ అని చెప్పుకుంటూ లేదా సీనియర్ మేనేజర్ అని లేక ప్రభుత్వ ఆఫీసర్ అని చెప్తూ మీకు ఫోన్ చేస్తారు. మీరు నమ్మే విషయాలు చెబుతు చివరికి OTP లేదా ఇతర పర్సనల్ వివరాల సమాచారం చెప్పమని మిమ్మల్ని ఒప్పిస్తారు. ఒకోసారి మిమ్మల్ని భయపెడతారు కూడా. అంతేకాదు అర్జంటుగా డబ్బు పంపండి అని లేదా మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ (OTP) చెప్పండి అని అడుగుతారు. కంగారు పడి మీరు వాళ్ళు అడిగింది చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది.
4. AI వాయిస్ క్లోనింగ్ స్కామ్‌లు
AI వాయిస్ క్లోనింగ్ అనేది మోసగాళ్లు రూపొందించిన ఒక కొత్త టెక్నిక్. AI సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, మీ తెలిసిన వారి గొంతుల క్లోన్ చేసి, లేదా పోలీసులమని చెప్తూ మీకు కాల్ చేస్తారు. ఒకోసారి మీ కుటుంబ సభ్యులు అరెస్టు అయ్యారని చెబుతారు. AIని ఉపయోగించి మిమ్మల్ని భయపెట్టవచ్చు. ఆ భయంలో చాలా మంది కోర్టు, పోలీస్ కేసు ఇవన్నీ ఎందుకు అని డబ్బులు ఇస్తే సరిపోతుంది అని చెప్తారు. ఇది నిజమేనని నమ్మి డబ్బు పంపి మోసపోకండి. ఈ స్కామ్ ఇప్పుడు సర్వసాధారణంగా మారింది.
5. ఫిషింగ్ లేదా ఫేక్ బ్యాంక్ స్కామ్‌లు
మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయిందని లేదా బ్లాక్ అయ్యిందని ఓ లింక్ పంపించి కేవైసీ (KYC) అప్‌డేట్ చేసుకునేందుకు క్లిక్ చేయమని మెసేజ్ పంపిస్తారు. కంగారులో నిజమేనేమో అని నమ్మి లింక్‌పై క్లిక్ చేస్తే ఒక ఫేక్ బ్యాంక్ వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయగానే స్కామర్లు మీ బ్యాంక్ వివరాలన్నీ తెలుసుకొని డబ్బులు కొట్టేస్తారు.
6. సిమ్ స్వాప్ స్కామ్‌లు
సిమ్ స్వాప్ స్కామ్‌లో మోసగాళ్ళు మీ సమాచారాన్ని ఉపయోగించి మీ పేరు మీద డూప్లికేట్ సిమ్ కార్డ్ తీసుకుంటారు. సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత మీ ఫోన్లో సిగ్నల్ పోతుంది. మీ వచ్చే కాల్స్, మెసేజులు, OTP వారికీ వెళ్తాయి. దీని వల్ల మీ నంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ చేస్తారు, పర్సనల్ వివరాలు ప్రమాదం పడుతుంది.
