ఏపీలోని విశాఖపట్టణం వాసులే టార్గెట్ గా జరిగిన భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో 15 మంది విశాఖ వాసుల నుంచి రూ. 2 కోట్లు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... వైజాగ్ కు చెందిన 60 ఏళ్ళ వ్యక్తితో IIFL ప్రతినిధులుగా పరిచయం చేసుకున్న కేటుగాళ్లు నకిలీ ప్లాట్ ఫామ్ ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్ అంటూ మోసానికి పాల్పడ్డారు. కేటుగాళ్లు బాధితుడి నుంచి సుమారు రూ. కోటి వరకు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.
బాధితుడిని మొదట ఫేస్‌బుక్‌లో సంప్రదించి నకిలీ ప్లాట్ ఫామ్ ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్ అంటూ నమ్మించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల కోసం DMAT ట్రేడింగ్ అకౌంట్ తెరిచిన బాధితుడు అతని బ్యాంక్ అకౌంట్ల నుండి పలు లావాదేవీల ద్వారా రూ. కోటి వరకు కేటుగాళ్లకు సమర్పించినట్లు తెలిపాడు. ట్రేడింగ్ ద్వారా వచ్చిన లాభాన్ని విత్ డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా...రూ. 38 లక్షలు డిపాజిట్ చేయాలని మోసగాళ్లు డిమాండ్ చేశారని తెలిపాడు బాధితుడు.
మోసగాళ్లు అడిగిన సొమ్ము ఇచ్చేందుకు బాధితుడు నిరాకరించడంతో అతని ఫోన్ కాల్స్, మెసేజెస్ కి రెస్పాండ్ అవ్వడం మానేశారని తెలిపాడు బాధితుడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులు ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ : రాకెట్‌లా దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్, 500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, 25,950 దాటిన నిఫ్టీ..
ఇలాగే మరొక బాధితుడికి ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా 20 నుంచి 30 శాతం వరకు లాభం ఇస్తామని చెప్పి సుమారు రూ. 80 లక్షలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. ఈ తరహా మోసాలన్నీ వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ప్లేట్ ఫామ్స్ ద్వారా లింకులు పంపి చేస్తున్నారని తెలిపారు పోలీసులు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటూ వచ్చే మెసేజ్ లు చూసి మోసపోవద్దని.. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.
