మెదక్ టౌన్, వెలుగు: సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ప్రారంభమైన ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై రూపొందించిన అవగాహన పోస్టర్లను జిల్లా పోలీస్ ఆఫీస్లో ఆవిష్కరించారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోస్టర్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు తదితర రద్దీ ప్రాంతాల్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించిన సైబర్ నేరాల పోస్టర్లు విద్యా సంస్థలు, బస్టాండ్లు, మార్కెట్లలో అతికించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్ర బోస్, ఆర్ఐ శైలేందర్, ఆర్ఎస్ఐ నరేశ్, సైబర్ క్రైమ్ సిబ్బంది సయ్యద్, సాయికిరణ్ పాల్గొన్నారు.
