ఏ పార్టీ బతకాలన్నా గ్రామస్థాయి ఎన్నికలే పునాది మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఏ పార్టీ బతకాలన్నా  గ్రామస్థాయి ఎన్నికలే పునాది మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఏ పార్టీ బతకాలన్నా, రాజకీయ నేతల తలరాతలు మార్చాలన్నా గ్రామస్థాయి ఎన్నికలే పునాది అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి అన్నారు. చుంచుపల్లి మండలంలోని మంత్రి క్యాంప్​ఆఫీస్​లో కాంగ్రెస్​ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లతో గురువారం నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయి ఎన్నికలు రాజకీయాలకు ఆయువుపట్టు లాంటివన్నారు. గత బీఆర్​ఎస్​ హయాంలో స్థానిక సంస్థలు ఎన్నికలు కుట్రలు, కుతంత్రాలతో సాగాయని తెలిపారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్​ రెడ్డి హయాంలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో రాజ్యాంగబద్ధంగా ప్రశాంతంగా సాగాయన్నారు. 

జిల్లాలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్​ మద్దతు దారులు విజయం సాధించడం పార్టీ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విజయమేనని తెలిపారు. పార్టీ కోసం పనిచేస్తున్న అందరికీ న్యాయం చేస్తామన్నారు. గెలిచిన వారికి ప్రోత్సహిస్తూ, ఓడిన వారికి భరోసా కల్పించే ప్రోగ్రాం చేపడుతామని చెప్పారు. క్రిస్టమస్​లోపే ప్రతి నియోజకవర్గంలో గెలిచిన, ఓడిన సర్పంచులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగూడెంలో నియోజకవర్గంలో ఫ్రెండ్లీ ఫైటింగ్​ చేశామని, కొత్తగూడెంలో ఎమ్మెల్యే లేడు అనే దిగులు పడొద్దని చెప్పారు. ఓటమిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అంకెల గారడీ చేస్తూ మసిపూసి మారేడు కాయ చేస్తున్నాయని విమర్శించారు

గ్రామీణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్​ వైపే ఉన్నారని చెప్పేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్​కు వచ్చిన ఫలితాలే నిదర్శనమన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు సాధిస్తామన్నారు. ఈ ప్రోగ్రాంలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణతో పాటు పలువురు కాంగ్రెస్​ నేతలు పాల్గొన్నారు.  

రాంరెడ్డి మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి 

కూసుమంచి : పాలేరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఎడవల్లి రాంరెడ్డి (57) బుధవారం బైక్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం ఖమ్మం మమత ఆస్పత్రిలో ఉన్న ఆయన మృదేహాన్ని మంత్రి పొంగులేటి సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చురుకైన వ్యక్తిగా రాంరెడ్డి ఉండేవారని, పాలేరు జీపీని ఏకగ్రీవంగా చేసిన నాయకుడని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండీ హాఫీజుద్దీన్, మాజీ సర్పంచ్ బజ్జురి వెంకటరెడ్డిపాల్గొన్నారు.