రౌడీలను నగరానికి దూరంగా పెట్టాం : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

రౌడీలను నగరానికి దూరంగా పెట్టాం : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
  • ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు
  • మంత్రి తుమ్మల నాగేశ్వర రావు 

ఖమ్మం టౌన్,వెలుగు :  ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం భూ కబ్జాదారులు, రౌడీలను నగరానికి దూరంగా పెట్టామని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.  ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖమ్మం నగర పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.  గురువారం ఖమ్మం నగరం 14వ డివిజన్ గోపాలపురంలో రూ.2.25 కోట్లతో చేపట్టిన బీటీ, సీసీ రోడ్లు, డ్రైన్ ల అభివృద్ధి పనులకు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  గంజాయి నియంత్రణకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలన్నారు. ఖమ్మం నగర అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసిందని, జనవరిలో మరో రూ.50 కోట్లు మంజూరు చేసేలా కృషి చేస్తున్నామని తెలిపారు.  

గోపాలపురంలో శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగర జనాభా 5 లక్షలకు చేరిందని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా, నూతన డ్రెయిన్ లు, రోడ్డు సౌకర్యం కల్పించాలని సూచించారు.  ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లలో ఫుట్ పాత్, పార్కుల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.  ఖమ్మం  నగరానికి మణిహారంగా కేబుల్ బ్రిడ్జి, ఖమ్మం ఖిల్లాకు రొప్ వే, సింథటిక్ ట్రాక్  ప్రధాన రోడ్లు విస్తరణ లాంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమంత రావు, కార్పొరేటర్లు, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ఇర్రిగేషన్ ఈఈ  అనన్య, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.