సర్పంచ్ గా వాచ్ మెన్ కుటుంబం

సర్పంచ్ గా వాచ్ మెన్ కుటుంబం

శాయంపేట, వెలుగు: పని కోసం హనుమకొండకు వలస వెళ్లి వాచ్​మెన్​గా పనిచేసుకుంటున్న కుటుంబం అనూహ్యంగా సర్పంచ్​ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారంలో జరిగింది. గ్రామానికి చెందిన మాధారం సరోజన సాంబయ్య తన రెండు ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ, కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో కుటుంబపోషణ భారమై పనుల కోసం హనుమకొండకు వలస వెళ్లి వాచ్​మెన్​గా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

 గ్రామంలో ఉన్న సమయంలో రెండు సార్లు వార్డు మెంబర్​గా పనిచేసిన అనుభవంతో ఈసారి గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్​ రావడంతో కాంగ్రెస్​పార్టీకి చెందిన నాయకులు సరోజను సర్పంచ్​గా పోటీ చేయాలని ప్రోత్సహించారు. దీంతో మూడు నెలల కింద తాము పనిచేసే వాచ్​మెన్​ పనులకు వేరేవారికి అప్పగించి, గ్రామానికి చేరుకుని ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్​ అభ్యర్థి అయిన మాధారపు సరోజన 29 ఓట్లతో గెలుపొందారు. వాచ్​మెన్​ కుటుంబం సర్పంచ్​ కావడంతో గ్రామస్తులు సరోజన సాంబయ్య దంపతులకు స్వీట్లు పెట్టి సంబురాలు చేసుకున్నారు.