ఇయ్యాల సుప్రీం ముందుకు ‘ఫిరాయింపుల’ కేసు

ఇయ్యాల సుప్రీం ముందుకు ‘ఫిరాయింపుల’ కేసు

న్యూఢిల్లీ, వెలుగు: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు శుక్రవారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, కౌశిక్ రెడ్డి, వివేకానంద్, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు కొనసాగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్(సివిల్) దాఖలు చేశారు. ఆ పిటిషన్లన్నింటినీ విచారించి వీలైనంత త్వరగా, లేదంటే 3 నెలలోపు నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని బెంచ్ స్పీకర్​ను ఆదేశించింది. దీంతో స్పీకర్ సుప్రీంకోర్టులో సమయం కోరగా, ఉద్దేశ పూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని బీఆర్ఎస్ వాదనలు వినిపించింది.

 ఈ క్రమంలో అప్పటి సీజేఐ, జస్టిస్ బీఆర్ గవాయి డిసెంబర్ 19లోపు 10 మంది ఎమ్మెల్యేలపై విచారణ ముగించాలని ఆదేశించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ప్రకాశ్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌పై వచ్చిన ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని చెబుతూ ఆ ఐదు పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. మరో ఐదుగురికి సంబంధించిన అంశం పెండింగ్ లోనే ఉంది. దానం నాగేందర్.. స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు.