- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదనడం దురదృష్టకరం: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని స్పీకర్ తీర్పు ఇవ్వడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్పీకర్ తన తీర్పుపై పునరాలోచన చేయాలని, ఫిరాయింపుల చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘పార్టీ మారినట్టు కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వయంగా టీవీల ముందు, ప్రజల ముందు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. ఇన్ని ఆధారాలున్నా.. వాళ్లు పార్టీ మారలేదని స్పీకర్ తీర్పు ఇవ్వడం దురదృష్టకరం” అని అన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ చట్టాలను అపహాస్యం చేశాయని మండిపడ్డారు.
నాడు కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారికి బీఆర్‌ఎస్ మంత్రి పదవులు ఇచ్చిందని గుర్తుచేశారు. ‘‘రాహుల్ గాంధీ.. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరగడం కాదు. తెలంగాణలో ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారో చూడండి. రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు చేసి చూపించాల్సిన బాధ్యత మీపై ఉంది” అని పేర్కొన్నారు. రెండు నాల్కల ధోరణితో రాహుల్ వ్యవహరించడం సరికాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయన్నారు.
అప్పుల కోసమే కొత్త డిస్కం..
అప్పుల కోసమే ప్రభుత్వం కొత్త డిస్కం ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘‘కొత్తగా మూడు విద్యుత్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నది. అసలు అప్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విద్యుత్ ప్లాంట్స్ నిర్మించాలి? ఎన్టీపీసీతో కలిసి విద్యుత్ ప్లాంట్స్ నిర్మాణానికి ఎందుకు ప్రయత్నించడం లేదు? కొత్త డిస్కం ఏర్పాటు చేసినంత మాత్రాన విద్యుత్ ఉత్పత్తి జరగదు. విద్యుత్ ఉత్పత్తికి కూడా ఆలోచనలు చేయాలి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న డిస్కంలను ఎలా బయటపడేస్తారో ముందు చెప్పాలి.
డిస్కంల అప్పు రూ.30 వేల కోట్లకు పైగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు” అని పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో లక్ష మెగావాట్ల పవర్ డిమాండ్ పెరుగుతోందని భట్టి చెప్పారు. కానీ దీనికి తగ్గట్టు విద్యుదుత్పత్తి, విద్యుత్ పంపిణీకి అవసరమైన మౌలిక వసతులు లేవు” అని మండిపడ్డారు.
కిషన్ రెడ్డి ఇంట్లో బీజేపీ ఎంపీల భేటీ
తెలంగాణలో పార్టీ వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ కావడంతో పంచాయితీలు వీడి ఐక్యత దిశగా రాష్ట్ర బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు సమావేశం అయ్యారు. ఆయన నివాసంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్, కొండా విశ్వేశ్వరరెడ్డి, గొడం నగేశ్, ఈటల రాజేందర్, ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు.
