ఇండియా, ఒమన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్

ఇండియా, ఒమన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్
  • ఎగుమతి అవుతున్న 98 శాతానికిపైగా వస్తువులపై సుంకాలు రద్దు
  • టెక్స్‌‌‌‌టైల్స్, లెదర్, ఫుట్‌‌‌‌వేర్ రంగాలకు భారీ మార్కెట్
  • వీసా నిబంధనల్లో మార్పుకు ఇరు దేశాలు అంగీకారం
  • ఒమన్​తో వ్యూహాత్మక భాగస్వామ్యం: మోదీ
  • సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ తో ద్వైపాక్షిక చర్చలు

మస్కట్: గత 11 ఏండ్లలో ఇండియా కేవలం తన పాలసీలను మాత్రమే మార్చుకోలేదని.. దేశ ‘ఆర్థిక డీఎన్ఏ’ను మార్చుకున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో అనిశ్చితి ఉన్నప్పటికీ, ఇండియా 8 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటుతో వేగంగా దూసుకుపోతున్నదని గుర్తుచేశారు. ఒమన్​తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదరడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఓమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ సమక్షంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఒమన్ మంత్రి ఖైస్ బిన్ మహమ్మద్ అల్ యూసఫ్ ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. ఇథియోపియా పర్యటన ముగించుకున్న   మోదీ.. బుధవారమే ఒమన్‌‌‌‌ చేరుకున్నారు. గురువారం అల్ బరకా ప్యాలెస్ లో మోదీకి సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిఫెన్స్, సెక్యూరిటీ, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్​మెంట్, ఎనర్జీ, అగ్రికల్చర్, టెక్నాలజీ, కల్చర్, పీపుల్ టు పీపుల్ టైస్​తో పాటు కీలక రంగాలపై చర్చించుకున్నారు.  హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతపై సహకారం కోసం ఒప్పందం చేసుకున్నారు. గ్రీన్ హైడ్రోజన్, రెన్యువబుల్ ఎనర్జీ అభివృద్ధిలో కలిసి పనిచేయడం, డిజిటల్ పేమెంట్స్ (యూపీఐ), అంతరిక్ష పరిశోధనలు, స్టార్టప్ రంగాల్లో భాగస్వామ్యంపై డీల్ కుదిరింది. 

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభతరం

ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కారణంగా ఇండియా నుంచి ఒమన్‌‌‌‌కు ఎగుమతయ్యే 98% కంటే ఎక్కువ వస్తువులపై సుంకాలు రద్దవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మస్కట్‌‌‌‌లో నిర్వహించిన ‘ఇండియా – ఒమన్ బిజినెస్ ఫోరమ్’లో ఆయన ప్రసంగించారు. ‘టెక్స్‌‌‌‌టైల్స్, లెదర్, ఫుట్‌‌‌‌వేర్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో ఇండియా ఎగుమతులకు భారీగా మార్కెట్ లభిస్తుంది. భారతీయ నిపుణులు (డాక్టర్లు, అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్లు) ఒమన్‌‌‌‌లో పనిచేసేందుకు వీలుగా వీసా నిబంధనల సరళీకరణపై కూడా హామీలు లభించాయి’’అని ప్రధాని మోదీ అన్నారు.

అరేబియా సముద్రం.. ఆర్థిక వ్యవస్థలకు వారధి

సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంతో ఇండియా కేవలం ఒమన్ మార్కెట్‌‌‌‌నే కాకుండా, దీని ద్వారా గల్ఫ్ దేశాలు (జీసీసీ), ఆఫ్రికా, యూరప్ మార్కెట్లను కూడా సులభంగా చేరుకోవడానికి వీలవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇండియా, ఒమన్ దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మాండవి నుంచి మస్కట్ వరకు వ్యాపించి ఉన్న అరేబియా సముద్రం రెండు దేశాల సంస్కృతులను, ఆర్థిక వ్యవస్థలను కలిపే ఒక బలమైన వారధి అని ఆయన వ్యాఖ్యానించారు. పూర్వీకుల కాలం నుంచే సముద్ర వాణిజ్యంలో ఇరు దేశాలు సుసంపన్నమైన వారసత్వాన్ని కలిగి ఉన్నాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్నేహం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని మోదీ ఆకాంక్షించారు. 

నవ భారతం దూసుకుపోతున్నది

నేటి నవభారతం ప్రపంచ వేదికలపై దూసుకుపోతున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒమన్‌‌‌‌లో సుమారు 7 లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు. వీరిని ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడారు. ‘21వ శతాబ్దపు ఇండియా.. వెనకడుగు వేయదు. ఇది పెద్ద పెద్ద నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకోగలదు’’అని అన్నారు. 

మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం

ఒమన్‌‌‌‌లో మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేసినందుకు మోదీకి అక్కడి ప్రత్యేక పౌర పురస్కారమైన ‘ఆర్డర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఒమన్‌‌‌‌’తో సుల్తాన్‌‌‌‌ హైతమ్‌‌‌‌ బిన్‌‌‌‌ తారిఖ్​ సత్కరించారు. ఇక ఒమన్‌‌‌‌లో మోదీ పర్యటించడం ఇది రెండోసారి. ఇరు దేశాల దౌత్య సంబంధాలకు ఏడు దశాబ్దాలు పూర్తైన నేపథ్యంలో తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అవార్డుతో కలిపి ప్రధాని మోదీకి వివిధ దేశాల నుంచి లభించిన అంతర్జాతీయ అత్యున్నత పురస్కారాల సంఖ్య 29కి చేరింది. ఇదే పర్యటనలో ఒమన్‌‌‌‌కు రాకముందు ఆయనకు ఇథియోపియా ప్రభుత్వం కూడా తన అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ను అందజేసింది.