సౌదీ అరేబియా: పాకిస్తానీ బిచ్చగాళ్లపై సౌదీ అరేబియా కఠిన చర్యలు తీసుకుంది. ఆ దేశానికి చెందిన 56 వేల మంది బిచ్చగాళ్లను తిరిగి వెనక్కి పంపించింది. తమ దేశంలో భిక్షాటన, క్రిమినల్ నేరాలు పెరుగుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది.
పర్యాటక వీసాలపై సౌదీకి వచ్చిన తర్వాత పాక్ జాతీయులు భిక్షాటన చేస్తూ, నేరాలకు పాల్పడుతున్నారని చెప్పింది. అలాగే, చాలా మంది పాకిస్తానీ పౌరులపై యూఏఈ వీసా ఆంక్షలు కూడా విధించింది. అయితే, సౌదీ అరేబియా చర్యలు అంతర్జాతీయంగా తమ దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు.
2025లో సౌదీలో భిక్షాటన చేస్తున్న సిండికేట్లను విచ్ఛిన్నం చేయడానికి, అక్రమ వలసలను నిరోధించడానికి అధికారులు ఎయిర్‌పోర్ట్‌లలో 66,154 మంది ప్రయాణికులను అక్కడికక్కడే నిలిపివేసింది.
ఈ భిక్షాటన నెట్‌వర్క్‌లు పాకిస్తాన్ ప్రతిష్టకు నష్టం కలిగిస్తున్నాయని ఎఫ్‌ఐఏ డైరెక్టర్ జనరల్ రిఫత్ ముక్తార్ అన్నారు. కాగా, ఈ ఏడాది యూఏఈ దాదాపు 6 వేల మందిని, అజర్‌బైజాన్ 2,500 మంది పాక్ బిచ్చగాళ్లను డిపోర్ట్ చేశాయి.
