రైతులపై అదనపు భారం మోపొద్దు! : సీఎండీ జితేష్ వి పాటిల్

రైతులపై అదనపు భారం మోపొద్దు! : సీఎండీ జితేష్ వి పాటిల్
  •     కొత్తగా 5వేల ట్రాన్స్‌‌ఫార్మర్లు మంజూరు
  •     టీజీఎస్‌‌పీడీసీఎల్‌‌​సీఎండీ జితేష్ వి పాటిల్

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ అవసరాల కోసం ట్రాన్స్‌‌ఫార్మర్లు మరమ్మతుకు గురైతే, వాటిని సరిచేసేందుకు రైతుల నుంచి అదనంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయొద్దని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్‌‌పీడీసీఎల్) సీఎండీ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. ప్రతి సెక్షన్ పరిధిలో తగినంత సంఖ్యలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌‌ఫార్మర్లను (డీటీఆర్) అందుబాటులో ఉంచాలని కోరారు. 

సోమవారం వికారాబాద్ జిల్లా పరిగిలోని ట్రాన్స్‌‌ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ (టీఆర్సీ)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని సబ్‌‌స్టేషన్లు, రిపేరింగ్ సెంటర్లను సందర్శించిన సీఎండీ, క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా తీరును సమీక్షించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేసవి దృష్ట్యా విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నదని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేసవి డిమాండ్‌‌ను తట్టుకునేందుకు డిస్కమ్ పరిధిలో 5,000 కొత్త ట్రాన్స్‌‌ఫార్మర్లను మంజూరు చేశారు. ఇందులో 3,000పైగా ట్రాన్స్‌‌ఫార్మర్లను గ్రామీణ ప్రాంతాలకే కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నెల 13న గరిష్ట విద్యుత్ డిమాండ్ 11,318 మెగావాట్లకు చేరగా, వినియోగం 222.34 మిలియన్ యూనిట్లుగా నమోదైందని వివరించారు. 

మార్చి చివరి నాటికి ఈ డిమాండ్ 12 వేల మెగావాట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. గత ఏడాదితో పోలిస్తే ఉమ్మడి మహబూబ్‌‌నగర్, నల్లగొండ జిల్లాల్లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని, అయితే ఎంత డిమాండ్ ఉన్నా తట్టుకునేలా ముందస్తు చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, నిబంధనలు ఉల్లంఘించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని  హెచ్చరించారు.