కేయూ భూమిని పోలీస్ ఆఫీసులకు ఇవ్వొద్దు  :  డా.నిమ్మల రాజేశ్

కేయూ భూమిని పోలీస్ ఆఫీసులకు ఇవ్వొద్దు  :  డా.నిమ్మల రాజేశ్

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ భూములను పోలీస్ ఆఫీసుల కోసం వినియోగించే ప్రయత్నాలను నిలిపివేయాలని ఏబీవీపీ కాకతీయ యూనివర్సిటీ ఇన్ చార్జి డా.నిమ్మల రాజేశ్ డిమాండ్ చేశారు. వర్సిటీ భూములు వర్సిటీకే దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కి వినతిపత్రం అందచేశారు.

ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ కేయూకు చెందిన భూమిలో సీఆర్పీఎఫ్ బెటాలియన్ తరలిపోవడంతో అందులో కాజీపేట ఏసీపీ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. కేయూలో ఎన్నో డిపార్ట్మెంట్లకు సొంత బిల్డింగులు లేక ఇబ్బందులు పడుతున్నామని, వర్సిటీ భవిష్యత్ అవసరాలకు ఆ భూమి అవసరం ఉంటుందన్నారు. వెంటనే ఏసీపీ ఆఫీస్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ను కోరారు. కార్యక్రమంలో ఏబీవీపీ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ఫణీంద్ర, విభాగ్ సెక్రటరీ సుజీత్, నేతలు తదితరులు పాల్గొన్నారు