ఐపీఎల్ కోడ్ ఉల్లంఘన.. పంత్ కు రూ.12 లక్షల ఫైన్

 ఐపీఎల్ కోడ్ ఉల్లంఘన.. పంత్ కు రూ.12 లక్షల ఫైన్

ఐపీఎల్ 2024 కోడ్ ను ఉల్లంఘించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు భారీగా జరిమానా పడింది. ఆదివారం డిఫెండింగ్ చాంపిన్ చెన్నై సూపర్ కింగస్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్ తలపడింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. దీంతో ఐపీఎల్ మేనేజ్ మెంట్ కెప్టెన్ పంత్ కు రూ.12 లక్షలు ఫైన్ విధించింది. ఈ సీజన్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జరిమానా పడింది. మార్చి 26న ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ స్లో ఓవర్ రేట్‌ నమోదు చేసింది. దీంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు రూ.12 లక్షల ఫైన్ విధించారు.

కాగా, నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా రెండు ఓటముల తర్వాత గెలుపొందిన ఢిల్లీ జట్టు ఈ మెగా టోర్నీలో బోణీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్ మన్లలో డేవిడ్ వార్నర్(51), పంత్(51)లు అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నై 171 పరుగులకే పరిమితమైంది. ఆఖర్లో ధోనీ( 37 నాటౌట్: 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈ సీజన్‌లో రెండు వరుస మ్యాచ్ లో గెలిచి జోరుమీదున్న చెన్నై.. తొలి ఓటమిని చవిచూసింది.