మాదాపూర్, వెలుగు: నిత్యం అత్యంత రద్దీగా ఉండే హైటెక్ సిటీ ప్రధాన రహదారి కుంగింది. ఐకియా నుంచి సైబర్టవర్స్ రూట్లో సైబర్ గేట్వే ఎదురుగా ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం రోడ్డు కుంగిపోయింది. దీంతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. ఐటీ ఉద్యోగులు ఇండ్లకు వెళ్లే సమయం, ఐకియా నుంచి సైబర్ టవర్స్ ప్రధాన రహదారి కావడం, ఇదే సమయంలో రోడ్డుపై గుంత ఏర్పడటం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
రోడ్డు మధ్యలో ఏర్పడిన గొయ్యి వద్ద సైబరాబాద్ పోలీసుల బారికేడ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ రద్దీని నియంత్రించారు. రోడ్డు పక్కనే ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ నుంచి మురుగునీరు లీకేజీ అవ్వడం వల్లే రోడ్డు కుంగిదని తెలుస్తోందని మాదాపూర్ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కుంగిన రోడ్డుకు టీజీఐఐసీ అధికారులు రిపేర్లు చేపట్టారు.
