
- యూనియన్ బ్యాంక్‌తో ఒప్పందం
- సూపర్ శాలరీ అకౌంట్ ఉన్న కార్మికులందరికీ బీమా
హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికుల ప్రయోజనం కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో యాజమాన్యం ఉచిత ప్రమాద బీమా ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్లో బ్యాంకు, సంస్థ అధికారులు ఒప్పందంపై సైన్ చేశారు. డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరామ్ మాట్లాడుతూ సంస్థ తమ కార్మికులకు, ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా ప్రతినెల దాదాపు రూ.300 కోట్ల వేతనాలు చెల్లిస్తుందని, ఏడాదికి రూ.30వేల కోట్ల టర్నోవర్‌ను బ్యాంకుల ద్వారా నిర్వహిస్తున్నదని తెలిపారు. ఉచిత ప్రమాద బీమా వర్తింపజేయడంతో కార్మికుల కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. ఇటీవల శ్రీరాంపూర్‌లో ఒక కార్మికుడు చని పోగా అతని ఫ్యామిలీకి రూ.74 లక్షలు ఇన్సూరెన్స్ కింద చెల్లించినట్లు చెప్పారు. సింగరేణి ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను సూపర్ శాలరీ అకౌంట్లుగా మార్చేందుకు హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీజీఎం భాస్కరరావు హామీ ఇచ్చారు.
ఒప్పందంతో ప్రయోజనాలు ఇవే..
సింగరేణి వ్యాప్తంగా యూనియన్ బ్యాంకులో ప్రస్తుతం 11,182 మంది కార్మికుల ఖాతాలు ఉన్నాయి. వీటికి ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా సూపర్ శాలరీ అకౌంట్లుగా మార్చాలని నిర్ణయించారు. ప్రతి కార్మికునికి ఫ్రీగా రూ.55 లక్షల బీమా సౌకర్యం అమలు చేయనున్నారు. నెలకు కనీసం25 వేల నుంచి 75 వేల గ్రాస్ సాలరీ ఉద్యోగులకు, అంతకు పైబడి శాలరీ ఉన్న వారికి ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది. సూపర్ శాలరీ అకౌంట్ ఉన్నందుకు 40 లక్షల ఇన్సూరెన్స్ పథకం, 5 లక్షల బ్యాంక్ ఇన్సూరెన్స్ తో పాటు ఏటీఎం రూపే కార్డు ఇన్సూరెన్స్ ద్వారా 10 లక్షల మొత్తం కలిపి 55 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కింద చెల్లిస్తారు.
ఉద్యోగి రూ.315 సాధారణ ప్రమాద ఇన్సూరెన్స్ స్కీమ్ కింద వార్షిక ప్రీమియమ్ చెల్లిస్తే ఆ పథకం కింద అదనంగా రూ.30 లక్షల ప్రమాద బీమా సొమ్ము చెల్లించడం జరుగుతుంది.