- మిలిటరీని మొబిలైజ్ చేస్తున్న రష్యా అనుకూల సపరేటిస్టులు
- ఉక్రెయిన్ ఫోర్సెస్ దాడి చేసే ముప్పు ఉందంటూ ఆరోపణలు
మాస్కో: ఉక్రెయిన్, రష్యా మధ్య రాజుకున్న నిప్పు చల్లారడం లేదు. రోజురోజుకూ ఉద్రిక్తతలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఒకవైపు ఉక్రెయిన్‌కు మూడు వైపులా రష్యా బలగాలు మోహరించి ఉండగా.. ఇప్పుడు రష్యా అనుకూల ఉక్రెయిన్ రెబెల్స్ కూడా తమ ఫోర్సెస్‌ను మొబిలైజ్ చేస్తున్నారు. ఉక్రెయిన్ బలగాలు తమ ప్రాంతంలో దాడులు చేస్తున్నాయని ఆరోపిస్తూ.. స్థానికులను రష్యాకు తరలిస్తున్నారు. డోనెట్స్క్ రీజియన్‌లోని రష్యా అనుకూల ప్రభుత్వ అధినేత డెనిస్ పుష్లిన్.. ఉక్రెయిన్ ఫోర్సెస్ వెంటనే దాడి చేసే ముప్పుందని, పూర్తి ట్రూప్స్‌ను మొబిలైజ్ చేయాలని, రిజర్వ్‌లో ఉన్న సైనికులు మిలటరీ ఆఫీసుల్లో రిపోర్టు చేయాలని ఆదేశాలిచ్చారు. ఆ వెంటనే లుహాన్సెక్ రీజియన్‌లో సపరేటిస్ట్ లీడర్ లియోనిడ్ పాసెచ్‌నిక్ కూడా ఇలాంటి ప్రకటనే రిలీజ్ చేశారు.
రెబెల్స్ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు
శుక్రవారం డోనెట్స్క్‌లో ప్రభుత్వ ప్రధాన బిల్డింగ్ దగ్గర్లో జరిగిన కారు బాంబు పేలుడు జరిగింది. లుహాన్సెక్ రీజియన్‌లోనూ శనివారం ఉదయం న్యాచురల్ గ్యాస్ మెయిన్, ఓ వెహికల్ సర్వీస్ స్టేషన్ దగ్గర రెండు బాంబులు పేలాయి. దీంతో ‘‘డోనెట్స్క్ రిపబ్లిక్‌లో తమ కుటుంబాలు, పిల్లలు, భార్య, తల్లులను కాపాడుకునేందుకు ఆయుధాలను చేతబట్టే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా” అని పుష్లిన్ పిలుపునిచ్చారు. అయితే పుష్లిన్ ఆరోపణలను ఉక్రెయిన్ ఆఫీసర్లు కొట్టిపారేశారు. మరోవైపు తిరుగుబాటుదారులు తమ పౌరులను రష్యాకు తరలించడం ప్రారంభించారు. రెబెల్ కంట్రోల్డ్ ఏరియాల్లోని 6,600 మందిని
రష్యాకు తరలించారు.
‘రష్యన్ సామ్రాజ్యం’ కోసం పుతిన్ ప్రయత్నం?
‘‘ఉక్రెయిన్.. రష్యాకు కిరీటం (క్రౌన్ జెవెల్ ఆఫ్ రష్యా)’’.. 2015లో పుతిన్ చేసిన కామెంట్ ఇది. ఉక్రెయిన్‌ను రష్యాలో కలుపుకోవాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలకు అద్దంపట్టే మాట. అది కూడా ఉక్రెయిన్ నుంచి క్రిమియాను స్వాధీనం చేసుకున్న కొన్ని రోజులకు అన్నారాయన. ‘‘రష్యా, ఉక్రెయిన్ ప్రజలంతా ఒక్కటే. వేర్పాటువాద శక్తులు.. ఈ రెండు దేశాల మధ్య గోడలు నిర్మిస్తున్నాయి’’ అంటూ 2021 జులైలో ఓ వ్యాసంలో పేర్కొన్నారు. ‘మదర్ రష్యా’ నుంచి ఉక్రెయిన్ వేరు కాకూడదన్నారు. తన హయాంలో ఉక్రెయిన్‌ను రష్యాలో కలపాలని ప్రయత్నిస్తున్నారు.
రష్యా బాలిస్టిక్ మిసైల్ టెస్టులు
తమ బలగాల సన్నద్ధతను, అణు, సంప్రదాయ ఆయుధాలను పరీక్షించుకునేందుకు భారీ సాయుధ కసరత్తును రష్యా సైన్యం శనివారం చేపట్టింది. హైపర్‌సోనిక్, క్రూయిజ్, న్యూక్లియర్ కేపబుల్ బాలిస్టిక్ మిసైళ్లను విజయవంతంగా పరీక్షించింది. అన్ని మిసైళ్లు టార్గెట్లను ధ్వంసం చేశాయని రష్యా రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. డ్రిల్స్‌లో టీయూ95 బాంబర్లు, సబ్‌మెరైన్లు కూడా ఉన్నట్లు పేర్కొంది.
