- ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్యలో ‘త్రీ పీరియడ్’ ప్లాన్
- స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ నిర్ణయం
- స్టూడెంట్లు బెటర్ రిజల్ట్స్ సాధించేలా ప్లాన్
హైదరాబాద్, వెలుగు: మార్చిలో ప్రారంభం కానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సమాయత్తం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా మంచి ఫలితాలు సాధించేలా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. కేవలం ఎగ్జామ్స్ నిర్వహించడమే కాకుండా.. పరీక్షల మధ్యలో దొరికే గ్యాప్‌లోనూ విద్యార్థులకు క్లాసులు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు స్టూడెంట్ల యాక్షన్ ప్లాన్ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారులు డీఈఓకు పంపించారు.
రాష్ట్రంలో ఈనెల17 నుంచి 24 వరకూ రాష్ట్రవ్యాప్తంగా ప్రీ-ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. ఇవి పూర్తికాగానే వార్షిక పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యేందుకు14 రోజుల పాటు ‘ప్రిపరేషన్ గ్యాప్’ ఇస్తున్నారు. ఈ సమయాన్ని పూర్తిగా అకాడమిక్ సపోర్ట్, రివిజన్, ప్రాక్టీస్ కోసం మాత్రమే వాడాలని స్పష్టం చేశారు. ప్రీ-ఫైనల్ ఫలితాల ఆధారంగా విద్యార్థులను మూడు కేటగిరీలుగా విభజించాలని సూచించారు. పాస్ అయ్యే అవకాశం తక్కువగా ఉన్నవారు, యావరేజ్ మార్కులు తెచ్చుకునేవారు, మంచి మార్కులు సాధించేవారుగా కేటగిరీలు చేయనున్నారు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి ప్రత్యేక వ్యూహాలతో చదువు చెప్పాలని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు.
హాలిడే రోజూ బడి నడవాల్సిందే
సాధారణంగా పబ్లిక్ పరీక్షల మధ్యలో వచ్చే సెలవుల్లో విద్యార్థులు ఇళ్లలో ప్రిపేర్ అవుతుంటారు. కానీ, ఈసారి ఆ పద్ధతి మార్చారు. ఒక్కో సబ్జెక్టు పరీక్షకు మధ్యలో 3 నుంచి 5 రోజుల గ్యాప్ ఉంటుంది. ఈ సెలవు రోజుల్లో కూడా బడి నడవాల్సిందేనని అధికారులు ఆదేశించారు. దీనికోసం ‘గ్యాప్ డేస్ యాక్షన్ ప్లాన్’ అమలు చేయనున్నారు. పబ్లిక్ పరీక్షల మధ్య వచ్చే సెలవు రోజుల్లో రోజువారీగా మూడు పీరియడ్ల చొప్పున క్లాసులు నిర్వహించాలని సూచించారు.
