
లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. ఈరోజు ( జులై 13) తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. తెల్లవారుజామునే ఆలయానికి వచ్చిన హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సాకలు సమర్పించి విశేష నివేదన చేశారు.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహింకాళి సన్నిధిలో బోనాల సందడి కొనసాగుతోంది . ఈరోజు ( జులై 13) వేకువ జామునుంచి మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆశీర్వచనాలకోసం బోనాలతో బారులు తీరారు. మహంకాళి అమ్మవారి దివ్యసన్నిధిలో కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసంలో ప్రత్యేకతను సంతరించుకున్నబోనాల పండుగలో అమ్మవారిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది.
లష్కర్‌లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి భక్తులు శోభాయమానంగా బోనాలు సమర్పించారు. ఆదివారం ( జులై 13) భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పోతురాజుల నృత్యాలు, కోలాట బృందాలు, గుస్సాడీ, పులివేషధారణ, డప్పు కళాకారుల చప్పుళ్లతో అమ్మవారి ఆలయ ప్రాంగణం శోభాయమానంగా మారింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి బారులు తీరారు. బోనాల వేడుకలు ఘటోత్సవంతో మొదలయ్యాయి.
మరోవైపు మహంకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహంకాళి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి వైభవంగా నిర్వహిస్తుందని తెలిపారు.
అమ్మవారి బోనాన్ని అలంకరించి అంగరంగ వైభవంగా ఉత్సవాలను ప్రారంభించినట్లు వెల్లడించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఇక్కడ బోనం సమర్పించడానికి అక్కాచెల్లెళ్లు అందరూ వస్తున్నారని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. అమ్మవారి దర్శనం కోసం వీఐపీల రాక మొదలైంది. రెండు రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి.