విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడతారా?

విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడతారా?
  • సిబ్బందిపై కలెక్టర్ ​ఆగ్రహం

సిద్దిపేట రూరల్, వెలుగు: విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడతారా అని కలెక్టర్ హైమావతి రాఘవాపూర్​కేజీబీవీ మధ్యాహ్న భోజన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం, వసతి విషయంలో రాజీపడితే సహించేది లేదని హెచ్చరించారు. బుధవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె వంటలు నాణ్యతగా, రుచికరంగా ఉండాలని ఆదేశించారు. రిజిస్టర్​లో ఉన్న సరుకులకు స్టోర్​రూమ్​లో ఉన్నవాటికి లెక్క కుదరకపోవడంతో ఎస్​వోపై యాక్షన్ తీసుకోవాలని డీఈవోకు ఫోన్​లో సూచించారు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలోని జడ్పీ హైస్కూల్, ఎంపీపీఎస్ కు వెళ్లి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం ఆకుకూర, పప్పు ఎందుకు వండలేదని సిబ్బందిని ప్రశ్నించారు. మెనూ పాటించేలా చూడాలని హెచ్ఎంలను 
ఆదేశించారు. 

‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి

కలెక్టరేట్​లో విద్య, పోలీస్, వైద్య, విద్యుత్​తదితర శాఖల అధికారులతో కలెక్టర్​హైమావతి సమావేశమయ్యారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదోతరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అడిషనల్ డీసీపీ కుశాల్కర్, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో నాగరాజమ్మ, డీఎంహెచ్ వో ధనరాజ్, ఆర్టీసీ డీఎం భవభూతి, డీపీఆర్వో రవికుమార్, ఎలక్ట్రిసిటీ డీఈ శ్రీనాథ్, పోస్టల్ ఆఫీసర్​సంతోష్ తదితరులు పాల్గొన్నారు.