సౌమ్య ఫ్యామిలీకి రూ.కోటి ఎక్స్‌‌గ్రేషియా : మంత్రి జూపల్లి

సౌమ్య ఫ్యామిలీకి  రూ.కోటి ఎక్స్‌‌గ్రేషియా : మంత్రి జూపల్లి
  • ఆమె తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం
  • ఎక్సైజ్‌‌ ఆఫీసర్లకు ఆయుధాల విషయం పరిశీలిస్తున్నం : మంత్రి జూపల్లి
  • స్వగ్రామం మోస్రాలో ముగిసిన సౌమ్య అంత్యక్రియలు

పద్మారావునగర్/నిజామాబాద్‌‌/వర్ని, వెలుగు : గంజాయి స్మగ్లర్ల దాడిలో చనిపోయిన ఎక్సైజ్‌‌ కానిస్టేబుల్‌‌ గాజుల సౌమ్య ఫ్యామిలీకి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్సైజ్‌‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు. ఆదివారం సికింద్రాబాద్‌‌లోని గాంధీ హాస్పిటల్‌‌లో సౌమ్య భౌతికకాయం వద్ద నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సౌమ్య కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌‌గ్రేషియాతో పాటు ఆమె తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, సౌమ్య రిటైర్మెంట్‌‌ వయస్సు వరకు రావాల్సిన వేతనాన్ని కుటుంబ సభ్యులకు చెల్లిస్తామని ప్రకటించారు.

సౌమ్య కుటుంబానికి ఒక్క రోజు వేతనాన్ని అందజేయాలని ఎక్సైజ్‌‌ శాఖ అధికారులు, సిబ్బంది తీసుకున్న నిర్ణయం అభినందించారు. ఎక్సైజ్‌‌ శాఖ సిబ్బంది భద్రత ప్రభుత్వ బాధ్యతని, భవిష్యత్‌‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 ఎక్సైజ్‌‌ ఆఫీసర్లకు ఆయుధాల కేటాయింపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆయన వెంట అడిషనల్‌‌ కమిషనర్‌‌ ఖురేషి, డిప్యూటీ కమిషనర్లు జె.హరికిషన్‌‌, అంజన్‌‌రావు, చంద్రయ్య, ప్రదీప్‌‌రావు, కృష్ణప్రియ, డి.శ్రీనివాస్‌‌, నవీన్‌‌కుమార్‌‌, అంజిరెడ్డి, సోమిరెడ్డి, ఎక్సైజ్‌‌ సూపరింటెండెంట్‌‌ మల్లారెడ్డి, గెజిటెడ్‌‌ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.లక్ష్మణ్‌‌గౌడ్‌‌ పాల్గొన్నారు.

కానిస్టేబుల్​ సౌమ్యకు కన్నీటి వీడ్కోలు

కానిస్టేబుల్‌‌ సౌమ్య అంత్యక్రియలు ఆదివారం ఆమె స్వగ్రామం నిజామాబాద్‌‌ జిల్లా మోస్రాలో ముగిశాయి. సౌమ్య శనివారం రాత్రి హైదరాబాద్‌‌లో చనిపోవడంతో డెడ్‌‌బాడీని ఆదివారం ఉదయం స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గోవూరు శివారు నుంచి ర్యాలీ నిర్వహించారు. సౌమ్య మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకురావడంతో గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర నిర్వహించి, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.

 ఎక్సైజ్‌‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు, బోధన్‌‌ ఎమ్మెల్యే సుదర్శన్‌‌రెడ్డి, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఎక్సైజ్‌‌శాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ రఘునందన్‌‌రావు, నిజామాబాద్‌‌ కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి, బోధన్‌‌ సబ్‌‌ కలెక్టర్‌‌ వికాస్‌‌ మహతో, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌‌ తాహెర్ బిన్‌‌ హందన్, నిజామాబాద్ సీపీ సాయి చైతన్య, ఎక్సైజ్‌‌ జిల్లా సూపరింటెండెంట్‌‌ మల్లారెడ్డి, డిప్యూటీ కమిషనర్‌‌ సోమిరెడ్డితో పాటు పలువురు నాయకులు సౌమ్య భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. పోచారం శ్రీనివాస్‌‌రెడ్డి, సీపీ సాయిచైతన్య, ఎక్సైజ్‌‌ డిప్యూటీ కమిషనర్‌‌ సోమిరెడ్డి, సూపరింటెండెంట్‌‌ మల్లారెడ్డి సౌమ్య పాడె మోశారు. 

సంతాపం తెలిసిన టీపీసీసీ చీఫ్​ మహేశ్‌‌గౌడ్‌‌

కానిస్టేబుల్‌‌ సౌమ్య చనిపోవడం బాధాకరమని టీపీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌కుమార్‌‌గౌడ్‌‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించి, సౌమ్య కుటుంబానికి  సానుభూతి తెలిపారు. చట్టాలను చేతుల్లోకి తీసుకునే వ్యక్తులను సర్కార్‌‌ ఉపేక్షించదని, ఇలాంటి ఘటనలు రిపీట్‌‌ కాకుండా నిందితులను శిక్షించాలని కోరారు.