అక్టోబర్ 30 నుంచి టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు

అక్టోబర్ 30 నుంచి టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు
  • ఫైన్ లేకుండా 13 వరకు కట్టేందుకు అవకాశం 

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజు గడువు షెడ్యూల్​ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి  ప్రకటించారు. ఈ నెల 30 నుంచి నవంబర్ 13 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఎస్ఎస్​సీ, ఓఎస్​ఎస్​సీ, ఒకేషనల్ పరీక్షలకు రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని చెప్పారు. ఆన్‌‌లైన్ ఇంటిగ్రేషన్ ద్వారా సైబర్ ట్రెజరీలో రుసుము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఫైన్ లేకుండా వచ్చే నెల13 వరకు, రూ.50 లేట్ ఫీజుతో నవంబర్ 15 నుంచి 29 వరకు, రూ.200 లేట్ ఫీజుతో డిసెంబర్ 2 నుంచి 11 వరకు, రూ.500 లేట్ ఫీజుతో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. 

అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టుల వరకు అటెండ్ అయ్యే విద్యార్థులకు రూ.110, మూడుకు పైగా సబ్జెక్టులకు రూ.125 ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.హెడ్మాస్టర్లు  ఎస్ఎస్​సీ ఎగ్జామ్ ఫీజు వివరాలను స్కూల్ నోటీసు బోర్డులో పెట్టి, పిల్లల నుంచి ఫీజులు తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ఫీజు వసూలు చేయొద్దని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

‌‌నేడు ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు

ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో గత నెలలో జరిగిన టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు గురువారం రిలీజ్ కానున్నాయని  సొసైటీ డైరెక్టర్‌‌‌‌ పీవీ శ్రీహరి ఒక ప్రకటనలో  తెలిపారు. ఉదయం 11 గంటలకు www.telanganaopenschool.org వెబ్ సైట్​లో రిజల్ట్స్ అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఈ సప్లిమెంటరీ పరీక్షలకు సుమారు 19వేల మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు.