మూడు కార్పొరేషన్లకు జూన్ లో ఎన్నికలు ?.. అప్పటిలోపు అన్ని చోట్లా అభివృద్ధి పనులు  

మూడు కార్పొరేషన్లకు జూన్ లో ఎన్నికలు ?.. అప్పటిలోపు అన్ని చోట్లా అభివృద్ధి పనులు  
  • వచ్చే నెల నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్ 
  • రోడ్లు, శానిటేషన్, స్ట్రీట్ లైట్లు, నాలాల సమస్యలపై ఫోకస్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. మున్సిపల్, కార్పొరేషన్​ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడంతో ఇదే ఊపుతో గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఒక ప్లాన్​ప్రకారం ముందుకు పోవాలని అనుకుంటున్నట్టు తెలిసింది. ముందుగా మూడు నెలల్లో మూడు కార్పొరేషన్లలో సమస్యలన్నీ పరిష్కరించి ఆ తర్వాత ఎలక్షన్లకు పోవాలని చూస్తున్నారు. ఇదే నిజమైన ఈ ఏడాది జూన్ లోనే మూడు కార్పొరేషన్లకి ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. 

100 రోజుల యాక్షన్​ ప్లాన్​

ఎన్నికలకు వెళ్లే ముందు మూడు కార్పొరేషన్ల పరిధిలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేసి ఎక్కడా సమస్యలు లేకుండా చేయాలని సర్కారు భావిస్తోంది. దీన్ని వచ్చేనెల నుంచే అమలు చేయనుండగా, యాక్షన్​ప్లాన్​లో ముందు రోడ్ల సమస్యపై దృష్టి పెట్టనున్నారు. పాట్ హోల్స్ ను పూడ్చడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా రోడ్లు వేయనున్నారు. తర్వాత శానిటేషన్, స్ట్రీట్ లైట్లు, నాలాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా సర్కిల్, జోన్ల వారీగా ఉన్న ప్రజా సమస్యలను గుర్తించి ఈ నెలాఖరులోపు తెలియజేయాలని డిప్యూటీ, జోనల్ కమిషనర్లకు.. కమిషనర్ల నుంచి ఆదేశాలందాయి. ఆ తర్వాత యాక్షన్​ప్లాన్​షురూ కానున్నది. 

మంత్రులకు ఇన్​చార్జీ బాధ్యతలు?

మూడు కార్పొరేషన్ల ఎన్నికలకి సంబంధించి మంత్రులు కీలకంగా వ్యవహరించే అవకాశమున్నది. మొత్తం 12 జోన్లుండగా, ఇక్కడ అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టేందుకు జోన్ కి ఒక మంత్రి చొప్పున బాధ్యతలు అప్పగించే ఛాన్స్​ఉంది. దీనివల్ల పనులు అవసరమైన చోట వెంటనే శాంక్షన్స్ ఇచ్చి పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మూడు కార్పొరేషన్లలో విలీనమైన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నట్లు తెలిసింది.