గొర్రెలు వద్దు... పైసలు కావాలంటూ గుండు కొట్టించుకున్నడు

గొర్రెలు వద్దు... పైసలు కావాలంటూ గుండు కొట్టించుకున్నడు
  •     మునుగోడులో డోలు దెబ్బ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి వినూత్న నిరసన

మునుగోడు, వెలుగు : తమకు గొర్రెలు వద్దని, పైసలే కావాలని డోలు దెబ్బ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మలిగ యాదయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకో చేసి రోడ్డుపైనే గుండు కొట్టించుకున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గొల్ల కురుమల నియోజకవర్గ అధ్యక్షుడు బూడిద లింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా గొర్రెల పంపిణీలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మలిగ యాదయ్య అక్కడే గుండు కొట్టించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేసిందని, లబ్ధిదారులు కూడా తమ వాటా కింద రూ.43,750 చొప్పున డీడీలు కట్టారని గుర్తు చేశారు.  

కానీ,  167 యూనిట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని వాపోయారు. రూ. 93 కోట్లు లబ్ధిదారుల ఖాతాలో ఉన్నా.. అకౌట్లు ఫ్రీజ్ ​చేశారని మండిపడ్డారు. వెంటనే ఫ్రీజింగ్​ ఎత్తివేసి డబ్బులు ఇస్తే లబ్ధిదారులు నచ్చిన చోట గొర్రెలు కొనుక్కుంటారన్నారు.  గొర్రెలు, మేకల పెంపకదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఆవిశెట్టి శంకరయ్య, బండ శ్రీశైలం, సాగర్ల మల్లేశ్​, సాగర్ల లింగస్వామి, పంగ రామ్మోహన్, ఆవుల శ్రీనివాస్, మైల సత్తయ్య, రాఘవేందర్, సాయిరాం, నారపాక అంజి ఉన్నారు.