ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తారా : సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తారా : సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక నిర్వహణ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో రిటర్నింగ్‌ అధికారి బ్యాలెట్‌ పత్రాలను తారుమారు చేసినట్లు రుజువు అవుతుందని సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది.  ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ..  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు.   బ్యాలెట్‌ పత్రాలు, వీడియో, ఇతర సామగ్రి సహా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని పంజాబ్- హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు. 

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, దానిని రద్దు చేసి మళ్లీ పోలింగ్‌ జరిపించాలని కోరుతూ ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫు కౌన్సిలర్‌ పంజాబ్- హరియాణా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు.  సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి చండీగఢ్‌ కార్పొరేషన్‌ సమావేశాన్ని వాయిదా వేయాలని ఆదేశిస్తూ..  అధికారులకు నోటీసులు జారీ చేసింది. 

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకున్నా  బీజేపీ మేయర్‌ అభ్యర్థి మనోజ్‌ సోంకర్‌ అనూహ్య విజయం సాధించారు. మెజారిటీకి అవసరమైన కౌన్సిలర్ల బలం(20) ఉన్నప్పటికీ ఆప్‌- కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌ ఓటమి పాలయ్యారు.  దీంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌-హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.