టీ20 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం

 టీ20 వరల్డ్ కప్: బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం
  • బంగ్లాదేశ్ స్కోర్: 18.2 ఓవర్లలో 84 ఆలౌట్
  • దక్షిణాఫ్రికా స్కోర్: 13.3 ఓవర్లలో 85/4 

అబుదాబీ: టీ20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ను దక్షిణాఫ్రికా ఓ ఆట ఆడుకుంది. సఫారీ జట్టు బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 18.2 ఓవర్లలో అతి కష్టం మీద 84 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. 
టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను తొలి ఓవర్లోనే దెబ్బకొట్టిన బంగ్లాదేశ్ ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయింది. 5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా పరుగుల వేట కొనసాగించారు. కెప్టెన్ బావుమాకు వాండర్ డస్సెన్ తోడై నిలకడగా ఆడడంతో దక్షిణాఫ్రికా  కేవలం 13.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 85పరుగులు చేసి ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహమ్మద్ రెండు వికెట్లు తీయగా.. మెహెదీ హసన్, నసూమ్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు. 
అంతకు ముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ను దక్షిణాఫ్రికా దెబ్బతీసింది. సఫారీ బౌలర్ల ధాటికి వరుసగా  సౌమ్య సర్కార్, ముష్ఫీకర్ రహీమ్ ఇద్దరు డకౌట్ కాగా.. ఓపెనర్ మహమ్మద్ నయిమ్ కూడా 9 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. పది ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి కేవలం 40 పరుగులు మాత్రమే చేసింది.

ఓపెనర్ లిటన్ దాస్ (24) కుదురుకున్నప్పటికీ సహచరుల నుంచి సహకారం లేకపోవడంతో ఒత్తిడి పెరిగిపోయింది. అయితే చివరి ఓవర్లలో మెహదీ హసన్ వేగంగా ఆడుతూ 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ కావడంతో బంగ్లా దేశ్ కుప్పకూలింది. టెయిల్ ఎండర్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోవడంతో బంగ్లాదేశ్ అతికష్టం మీద 18.2 ఓవర్లలోనే 84 పరుగులకు ఆలౌటై ప్రపంచకప్ లో అతితక్కువ స్కోర్ నమోదు చేసింది.