
- రాష్ట్ర కీలక నేతలతోఅభయ్ పాటిల్ భేటీ
- త్వరలోనే జాతీయ కమిటీ ఆమోదానికి లిస్ట్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బీజేపీ కొత్త కమిటీ కూర్పు దాదాపు ఖరారైంది. రాష్ట్రంలోని ముఖ్య నేతలతో స్టేట్ ప్రెసిడెంట్ ఎన్.రామచందర్‌రావు మాట్లాడి.. కొత్త టీమ్‌ను రెడీ చేశారు. దీన్ని జాతీయ కమిటీ ఆమోదానికి పంపించనున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్ పాటిల్‌తో రాంచందర్‌రావు, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ సమావేశమయ్యారు. ఆఫీస్ బేరర్లు, కొత్త కార్యవర్గంపై చర్చించారు. ఇప్పటికే కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌తోపాటు పలువురు సీనియర్ నేతల అభిప్రాయాలనూ సేకరించారు. 21 మందితో ఆఫీస్ బేరర్ల టీమ్ ఉండనున్నట్టు తెలుస్తున్నది.
దీంట్లో ముగ్గురు జనరల్ సెక్రెటరీలు, 8 మంది ఉపాధ్యక్షులు, మరో 8 మంది సెక్రెటరీలు, ఒక ట్రెజరర్ ఉండనున్నారు. ఈ లెక్కన ప్రెసిడెంట్‌తో కలిపి ఆఫీస్ బేరర్లు 21 మంది ఉండే చాన్స్ ఉంది. పార్టీలో అనుభవం ఉన్న సీనియర్లకు, యువతకు సమ ప్రాధాన్యత కల్పించేలా జాబితాను రూపొందిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ కులాలతోపాటు వివిధ సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఈ కమిటీని రెడీ చేసినట్టు పేర్కొంటున్నారు.
లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, కొత్త టీమ్ ఉండబోతుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తంగా 50 మందితో పూర్తిస్థాయి స్టేట్ కమిటీ ఉండనున్నట్టు తెలుస్తున్నది. కాగా, ఫైనల్ అయిన కొత్త కమిటీ లిస్ట్‌ను జాతీయ నాయకత్వానికి పంపించనున్నారు. వారి ఆమోదంతో కొత్త కమిటీని స్టేట్ ప్రెసిడెంట్ అధికారంగా ప్రకటించనున్నారు. అయితే, బీజేపీ స్టేట్ ఆఫీసులో కొందరు సీనియర్ నేతలు పాతుకుపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి కొత్త కమిటీలో ప్రాతినిధ్యం ఉంటుందా? లేదా? అనే దానిపై రాష్ట్ర నేతల్లో చర్చ నడుస్తున్నది.