ఇవాళ(అక్టోబర్15) కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్..

ఇవాళ(అక్టోబర్15) కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్..
  •     మధ్యాహ్నం విడుదల చేస్తామన్న మురళీధరన్
  •     70 మందికి స్క్రీనింగ్​ కమిటీ ఓకే
  •     ఢిల్లీలో కేసీ వేణుగోపాల్​ ఇంట్లో రాష్ట్ర నేతల భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక చేసేందుకు 4 సార్లు భేటీ అయిన కాంగ్రెస్ స్క్రీనింగ్​ కమిటీ మొ త్తం 70 సీట్లపై క్లారిటీ ఇచ్చింది. అయితే, ఇందులో 58 సీట్లకు పార్టీ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) ఓకే చెప్పింది. ఈ 58 మంది అభ్యర్థుల జాబితా (ఫస్ట్ లిస్ట్) ను ఆదివారం మధ్యాహ్నం రిలీజ్ చేస్తామని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ వెల్లడించారు. ఈమేరకు శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ నివాసంలో రాష్ట్ర నేతలు భేటి అయ్యారు. ఈ భేటిలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్, ఇతర నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, రాహుల్, ప్రియాంక టూర్, ప్రచార ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. కాగా, పార్టీ తొలి జాబితాలో రేవంత్ రెడ్డి(కొడంగల్), కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(నల్గొండ), ఉత్తమ్(హుజూర్ నగర్), మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి(పాలేరు), మైనంపల్లి(మల్కాజ్ గిరి), నారాయణ రెడ్డి(కల్వకుర్తి)తో పాటు  పలువురికి కన్ఫార్మ్ అయినట్లు సమాచారం.

రియల్’ వ్యాపారుల్లా కేసీఆర్ ఫ్యామిలీ.. రేవంత్

మోడల్​ ఇళ్లు ఒకటి కట్టి ప్లాట్లు అమ్మినట్లు.. త్రీడీ షోలు చూపించి అడ్వాన్స్ లు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తయారైందని టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఫక్తు రియల్​ ఎస్టేట్ వ్యాపారుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్ ను నిర్మించే విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నార న్నారని విమర్శించారు. ఓవైపు విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోకుండా పార్టీ ఫిరాయింపులు, బీఫాంలు, టికెట్ల వసూళ్లు, ఎన్నికల ప్రచారంపైనే కేసీఆర్ ఫోకస్ పెట్టారని విమర్శించారు. దీనిని బట్టే కేసీఆర్ మనస్తత్వం అర్థంచేస్కోవచ్చని తెలి పారు. మరోవైపు, బిల్లా, రంగా(హరీశ్ రావు, కేటీ ఆర్) లు అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించినప్పుడే తెలంగాణ సాధించుకున్న లక్ష్యం నెరవేరుతుందన్నారు. యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని, 2నెలలు ఓపిక పడితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. విమోచన దినోత్సవం నాడు సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఫైలుపై సోనియా  బర్త్​ డే  డిసెంబర్ 9న తొలి సంతకం చేస్తామని రేవంత్​ రెడ్డి తెలిపారు. ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగ నియామకాలను చేపడతామని హామీ ఇచ్చారు.

లెఫ్ట్ పార్టీలతో పొత్తులపై క్లారిటీ..

రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలతో పొత్తులపై కొంత క్లారిటీ వచ్చిందన్నారు. ఆ నిర్ణయాలను సీపీఐ, సీపీఎం నేతలతో పంచుకున్నాక మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల రాష్ట్ర పర్యటన వివరాలను ఆదివారం మధ్యాహ్నం వెల్లడిస్తామని రేవంత్​ వివరించారు.