
- ఇప్పటికే టీఎస్ పీఎస్సీ చైర్మన్ రాజీనామా.. అదే బాటలో మెంబర్లు
- కొత్త కమిషన్ ఏర్పాటుకు కొంత టైమ్ పట్టే చాన్స్
- చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్న సర్కార్
- అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపిక
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ప్రక్షాళనపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు జరిగిన తప్పులు మళ్లీ భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం కొత్త కమిషన్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత టైమ్ పట్టనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ ఖాళీల భర్తీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
టీఎస్పీఎస్సీపై రెండ్రోజుల కింద రివ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. నిబంధనల ప్రకారం కొత్త కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యూపీఎస్సీతో పాటు పలు రాష్ర్టాల్లోని బోర్డుల పనితీరును పరిశీలించి రిపోర్టు ఇవ్వాలన్నారు. కాగా, టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదించలేదు. కమిషన్ మెంబర్లు కూడా గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖలు ఇవ్వనున్నారు. వీళ్ల రాజీనామాలను గవర్నర్ ఆమోదిస్తే, కొత్త టీమ్ఏర్పాటుకు కసరత్తు మొదలుకానుంది.
కొత్త కమిషన్ ఏర్పడితేనే..
టీఎస్పీఎస్సీ ఇటీవల కాలంలో 17,269 పోస్టుల భర్తీకి 26 నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. ఇందులో గ్రూప్1, ఏఈఈ, డీఏఓతో పాటు పలు ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్లు లీక్ కావడంతో ఆయా పరీక్షలను రద్దు చేసింది. మరికొన్ని పరీక్షలను వాయిదా వేసింది. మొత్తంగా 13,821 పోస్టుల భర్తీకి సంబంధించి దాదాపు 20 ఎగ్జామ్స్ ను బోర్డు నిర్వహించింది. గ్రూప్3, డీఏఓ, హాస్టల్ వార్డెన్ తదితర పోస్టులకు సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించాల్సి ఉంది. ఇక గ్రూప్1 ఎగ్జామ్ పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. అయితే కమిషన్ చైర్మన్ రాజీనామా చేయడం, మిగతా సభ్యులు కూడా రాజీనామా చేస్తామని ప్రకటించడంతో బోర్డులో పనులన్నీ నిలిచిపోనున్నాయి. ఇప్పటికే పూర్తయిన ఎగ్జామ్స్ కు రిజల్ట్ ప్రకటించడం, నోటిఫికేషన్లు ఇచ్చిన వాటికి ఎగ్జామ్స్ నిర్వహించడం లాంటి ప్రక్రియలు ఆగిపోనున్నాయి. టీఎస్ పీఎస్సీలో ఏది చేయాలన్నా కమిషన్ ఆమోదం తప్పనిసరి. దీంతో కొత్త కమిషన్ ఏర్పడిన తర్వాతే కొలువుల ప్రక్రియ ముందుకుసాగనుంది.
గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ..
టీఎస్ పీఎస్సీపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయింది. కమిషన్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. మూడ్రోజుల కింద బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగా, మిగిలిన ఐదుగురు మెంబర్లు కూడా రిజైన్ చేస్తామని ప్రకటించారు. అయితే జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. ఒకవేళ బోర్డులో అక్రమాలపై నిగ్గుతేలే వరకు ఆయన్నే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటే, నిరుద్యోగుల నుంచి విమర్శలు రావొచ్చు. కొత్త సర్కారు కూడా ప్రస్తుతమున్న కమిషన్ తో రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టాలనే ఉద్దేశంలో లేదు. దీంతో గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్!
నిబంధనల ప్రకారమే కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. టీఎస్ పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించాలని రివ్యూ మీటింగ్ లో అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో రేరా చైర్మన్ నియామకం లాగే టీఎస్ పీఎస్సీ చైర్మన్ తో పాటు 11 మంది మెంబర్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి, అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. కమిషన్ మెంబర్లలో సగం మందిని సెంట్రల్, స్టేట్ సర్వీసుల్లో పని చేసినోళ్లను.. మిగిలిన సగం మందిని సోషల్ సైన్సెస్, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు వివిధ రంగాల్లో పని చేసినోళ్లను నియమించాల్సి ఉంటుంది. కాగా, చైర్మన్ సహా మెంబర్ పదవులపై కొందరు ప్రొఫెసర్లు, సీనియర్ ఉద్యోగులు ఉత్సాహం చూపిస్తున్నారు. సర్కార్ పెద్దలను కలిసి తమ బయోడేటాలు అందజేస్తూ, వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కానీ పైరవీలకు తావు లేకుండా నిబంధనల ప్రకారమే కమిషన్ను ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది.