కూరగాయల సాగులో కేరళ ఎలెవంచెరి మోడల్ భేష్ : రైతు కమిషన్

కూరగాయల సాగులో కేరళ  ఎలెవంచెరి మోడల్ భేష్ : రైతు కమిషన్
  • రాష్ట్రంలో అమలు కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తం: రైతు కమిషన్
  • కేరళ పర్యటనలో చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు
  • సాగు పాలసీలు, మార్కెటింగ్ , గ్రూప్​ ఫార్మింగ్ పరిశీలన

హైదరాబాద్, వెలుగు: కేరళలో కూరగాయలు, ఉద్యానవన పంటల సాగు విధానం ఆదర్శంగా ఉందని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న కూరగాయల సాగు పాలసీ, మార్కెటింగ్ వ్యవస్థ, కౌలు రైతుల పట్ల అనుకూలత ప్రశంసనీయమని తెలిపారు. ఇదే విధానాలు తెలంగాణలో అమలయ్యేలా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసులు చేయనున్నట్టు చెప్పారు. శుక్రవారం రాష్ట్ర రైతు కమిషన్ బృందం కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో పర్యటించింది.

 వడవన్నూర్, ఎలెవంచెరి గ్రామాల్లో సాగుతున్న కూరగాయల తోటలను సందర్శించింది. రైతులు, కౌలు రైతులతో నేరుగా మాట్లాడి సాగు విధానాలు, మార్కెటింగ్ పద్ధతులు, లాభనష్టాలపై పూర్తి వివరాలు సేకరించింది. కేరళ మోడల్‌‌ను తెలంగాణలో అమలు చేయడంపై కమిషన్ స్టడీ చేస్తున్నది. 

ఎలెవంచెరినే కేంద్ర బిందువు

పాలక్కాడ్ జిల్లాలోని ఎలెవంచెరి గ్రామం కేరళలో కూరగాయల ఉత్పత్తికి కేంద్రంగా మారిందని కోదండరెడ్డి అన్నారు. గ్రామంలోని 210 మంది రైతులు కలిసి 300 హెక్టార్లలో సాగు చేసి, 2024–25లో 4,500 టన్నుల ఉత్పత్తితో రూ.16.74 కోట్ల అమ్మకాలు సాధించారని తెలిపారు. పావక, కుంబలంగ, పడవలంగ, బీరకాయ, బెండకాయ, అలసందలు, గుమ్మడికాయ వంటి పంటలు విస్తృతంగా పండిస్తున్నారని వివరించారు.ఆధునిక పద్ధతులైన ఓపెన్ ఫీల్డ్ ప్రెసిషన్ ఫార్మింగ్, పండల్ విధానం, ప్లాస్టిక్ మల్చింగ్, ఫర్టిగేషన్, నేలపరీక్ష ఆధారిత ఎరువు నిర్వహణ, నాణ్యమైన విత్తనాలు ఈ మోడల్‌‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయని చెప్పారు. సొంత భూములతోపాటు లీజు భూములపైనా ఇదే ప్రయోగం విజయవంతంగా కొనసాగిస్తున్నారని కోదండరెడ్డి పేర్కొన్నారు.