మెడికల్ కౌన్సిల్లో 8కి చేరిన ఎక్స్ అఫీషియో మెంబర్లు.. జీఓ 229తో సభ్యుల సంఖ్య 25 నుంచి 29కి పెంపు

మెడికల్ కౌన్సిల్లో  8కి చేరిన ఎక్స్ అఫీషియో మెంబర్లు..  జీఓ 229తో సభ్యుల సంఖ్య 25 నుంచి 29కి పెంపు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) లో ఆఫీసర్ల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీఓ 229 ద్వారా ఎక్స్- అఫీషియో మెంబర్ల సంఖ్యను పెంచింది. మొన్నటి వరకు కౌన్సిల్​లో నలుగురు ఎక్స్ -అఫీషియో మెంబర్లు మాత్రమే ఉండగా.. ఈ కొత్త జీఓతో ఆ సంఖ్యను ఎనిమిదికి పెంచారు. తాజాగా విడుదలైన లిస్టులో.. హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), పబ్లిక్ హెల్త్ డైరెక్టర్(డీహెచ్), వైద్య విధాన పరిషత్ కమిషనర్, కేఎన్ఆర్ హెల్త్ వర్సిటీ వీసీ, ఆరోగ్యశ్రీ సీఈఓ, డిపార్ట్​మెంట్ సెక్రటరీ, నిమ్స్ డైరెక్టర్.. ఇలా మొత్తం 8 మంది ఆఫీసర్లకు కౌన్సిల్‌లో చోటుకల్పించారు. దీంతో కౌన్సిల్‌ లో మొత్తం సభ్యుల సంఖ్య 25 నుంచి 29 కి చేరింది. 

వ్యతిరేకిస్తున్న డాక్టర్​ యూనియన్లు... 

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై డాక్టర్ల సంఘాలు మండిపడుతున్నాయి. జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని హెల్త్ కేర్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్, తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్, తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోషియేషన్ వ్యతిరేకిస్తున్నాయి. వైద్యవృత్తిపై, క్లినికల్ అంశాలపై పట్టులేని నాన్ -మెడికల్ ఆఫీసర్లకు కౌన్సిల్​లో చోటు కల్పించడం వల్ల.. డాక్టర్లపై అనవసర పెత్తనం పెరుగుతుందని, నకిలీ వైద్యుల ఏరివేతకు ఆటంకం కలుగుతుందని ఆయా సంఘాల లీడర్లు పేర్కొన్నారు.