- ఎండోమెంట్ భూముల్లో ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం
- త్వరలో దేవాదాయ శాఖతో సెర్ప్ ఒప్పందం
- ఒక్కోటి 4 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు
- మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే కాకుండా కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కార్ ముందుకెళ్తోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకున్నది. తొలి విడతలో 51 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం దేవాదాయ శాఖ నుంచి భూములను లీజ్ తీసుకుంటుంది.
ఇప్పటికే పలు జిల్లాలో ఎండోమెంట్ ల్యాండ్‌ను గుర్తించగా.. త్వరలోనే ఆ శాఖతో సెర్ప్ ఒప్పందం కుదర్చుకోనున్నది. ఒక్కో గ్రామైక్య సంఘం ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది. తొలి విడతలో 12 సంఘాలకు సోలార్ విద్యుత్‌ప్లాంట్ కేటాయించనున్నది.
కాగా, ఒక మెగావాట్ ఉత్పత్తి చేయడానికి రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపుగా నాలుగెకరాల విస్తీర్ణంలో ఒక్కో ప్లాంట్ ఏర్పాటు చేసేలా స్థల సేకరణ చేస్తున్నారు. సెర్ప్, స్త్రీనిధి ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రుణాలు అందజేయనున్నారు. కాగా, ఒక్కొక్క ప్లాంట్ ఏర్పాటుకు రూ.3 కోట్లు ఖర్చు కానుండగా.. ఇందులో మార్జిన్ మనీ కింద సంఘం 10 శాతం జమ చేయాలి. అంటే బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.2.70 కోట్లు వస్తే.. మిగతా రూ.30 లక్షలు గ్రామైక్య సంఘాలు జమ చేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు జమ చేయడం సంఘాలకు భారం కానుండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నిధులను సైతం ఏదో ఒక రూపంలో ఇప్పించేలా కసరత్తు చేస్తున్నది.
4 వేల ఎకరాల భూమి అవసరం..
రాష్ట్రవ్యాప్తంగా 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంట్లు ఏర్పాటు చేయాలంటే దాదాపు 4 వేల ఎకరాల భూమి అవసరం ఉంటుంది. అంటే ఒక్కో ప్లాంట్‌కు 4 ఎకరాల చొప్పున స్థలం అవసరం ఉంటుంది. ఇది కూడా విద్యుత్ సబ్ స్టేషన్ల సమీపంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు పలు జిల్లాల్లో డీఆర్డీఓ, గ్రామైక్య సంఘాలు స్థల సేకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకొచ్చాయి. రాష్ట్రంలో థర్మల్, హైడల్ పవర్ ద్వారా డిమాండ్‌కు సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు.
దీంతో సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి డిస్కంలకు విక్రయిస్తే.. మహిళా సంఘాలకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఒకసారి ప్లాంట్లు ఏర్పాటు చేస్తే దాదాపుగా 24 ఏండ్ల వరకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. సోలార్ ప్లాంట్ల నిర్వహణకు ఖర్చు తక్కువ, లాభం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వం సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రత్యేక వైబ్‌సైట్‌ను రూపొందించనున్నది. ఇందులో ప్లాంట్లకు సంబంధించిన విధివిధానాలను అందుబాటులో ఉంచనున్నారు.
