మన రాష్ట్రం అవకాశాల గని : మంత్రి శ్రీధర్ బాబు

మన రాష్ట్రం అవకాశాల గని : మంత్రి శ్రీధర్ బాబు
  • పారిశ్రామికాభివృద్ధికి అనుకూలం: మంత్రి శ్రీధర్ బాబు
  • పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం 

హైదరాబాద్, వెలుగు: విలువలతో కూడిన వృద్ధికి కేరాఫ్ గా ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తెలంగాణ ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. జైన్  ఇంటర్నేషనల్  ట్రేడ్  ఆర్గనైజేషన్(జీటో) హైదరాబాద్  చాప్టర్  ఆధ్వర్యంలో హైటెక్స్, హెచ్ఐసీసీలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ‘జీటో కనెక్ట్ 2025’ ని కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, కిషన్ రెడ్డితో కలిసి శుక్రవారం శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలిచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలను చూసే పెట్టుబడులు పెట్టేవారన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు వారి ఆలోచన తీరు కూడా మారిందని తెలిపారు. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నారన్నారు. తెలంగాణ అవకాశాల గని అని, పరిశ్రమల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత అనుకూల పరిస్థితులున్నాయని వివరించారు. 

జైన సమాజం ‘సేవా’ స్ఫూర్తిని, తెలంగాణ ఇన్నొవేషన్  ఎకో సిస్టమ్ తో అనుసంధానిస్తే ప్రపంచం కోరుకుంటున్న నైతిక వృద్ధి నమూనా ఆవిష్కృతమవుతుందన్నారు. నిజమైన యూనికార్న్  అంటే బిలియన్  డాలర్ల విలువ కాదని, లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేయడమని యువ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, జీటో హైదరాబాద్  చాప్టర్  ప్రతినిధులు రోహిత్ కొఠారి, లలిత్ చోప్డా, విశాల్  అంచాలియా, బీఎల్ భండారీ, సుశీల్  తదితరులు పాల్గొన్నారు.