హైదరాబాద్, వెలుగు: ఎల్నినో ప్రభావంతో రానున్న యాసంగి సీజన్లో వరి సాగు విస్తీర్ణం తగ్గి, పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పంట వ్యర్థాలను కాల్చకుండా పశుగ్రాసంగా వాడేలా రైతులకు అవగాహన కల్పించాలని, అవసరమైతే కలెక్టర్లు పశుగ్రాసాన్ని కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలని సూచించారు.
బుధవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గత యాసంగిలో దాదాపు 18 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలను కాల్చారన్న మంత్రి, ఈ వానాకాలం పంట కోత అనంతరం అటువంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శాటిలైట్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారంగా నేలలోని పోషకాల లభ్యతను అంచనా వేసే టెక్నాలజీని జర్మనీకి చెందిన ఏసీఆర్ఏటీ ప్రతినిధులు మంత్రికి వివరించారు.
దీని ద్వారా 12 రోజులకోసారి ఎరువుల వినియోగంపై సమాచారం అందించడంతోపాటు, ఒకేసారి 70 లక్షల మంది రైతులకు వివరాలు చేరవేసే అవకాశం ఉందన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు.. జర్మనీ ప్రతినిధులతో సమన్వయం చేసుకుని, రాష్ట్రంలోని వివిధ రకాల నేలలు, పంటలకు ఈ సాంకేతికత ఎంతవరకు ఉపయోగపడుతుందో అధ్యయనం చేయాలని వర్సిటీ వీసీ జానయ్యను మంత్రి ఆదేశించారు.
యూకే సంస్థలతో రెండు కీలక ఒప్పందాలు..
జౌళి రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హడర్స్ఫీల్డ్, టెక్స్టైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తో రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. బుధవారం సెక్రటెరియట్ లో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. హడర్స్ఫీల్డ్ విశ్వవిద్యాలయంతో కుదిరిన ఒప్పందం ద్వారా టెక్నికల్ టెక్స్టైల్స్ రంగంలో పరిశోధన, ఉమ్మడి విద్యా కార్యక్రమాలు, అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడిని ప్రోత్సహించనున్నారు.
టెక్స్టైల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో కుదిరిన రెండో ఒప్పందం ద్వారా నైపుణ్య శిక్షణ, పరిశ్రమల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయనున్నారు. ముఖ్యంగా 3డీ వీవింగ్, కాంపోజిట్ మెటీరియల్స్ వంటి ఆధునిక సాంకేతిక వస్త్రాల తయారీ, పరిశోధనపై దృష్టి సారించనున్నారు.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ ఈ ఒప్పందాల ప్రధాన లక్ష్యాలని మంత్రి తెలిపారు. ఈ భాగస్వామ్యాలతో తెలంగాణ జౌళి రంగానికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు.
