రోగాల బారిన ఖైదీలు.. రాష్ట్రంలోని జైళ్లలో మొత్తం 5,856 మంది ఖైదీలు

రోగాల బారిన ఖైదీలు.. రాష్ట్రంలోని  జైళ్లలో మొత్తం 5,856 మంది ఖైదీలు
  • 1,225 మంది‌‌‌‌ ఖైదీలకు బీపీ,1,461 మందికి షుగర్
  • ఫిట్స్‌‌‌‌తో బాధపడుతున్న ఖైదీల సంఖ్య 891
  • 18 మందికి హార్ట్‌‌‌‌ సర్జరీలు.. 
  •  హెల్త్ రికార్డులు, 
  • హెల్త్‌‌‌‌ క్యాంపులు నిర్వహణ 
  • మందుల కోసం రూ. 11.59 లక్షలు ఖర్చు
  • జైళ్లశాఖ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడి

హైదరాబాద్‌‌‌‌,వెలుగు: రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న ఖైదీలకు సుస్తి చేసింది. సగానికిపైగా ఖైదీలు దీర్ఘకాలిక వ్యాధుల బారినపడ్డారు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో పాటు అండర్‌‌‌‌ ట్రయల్‌‌‌‌ ఖైదీలను బీపీ, షుగర్‌‌‌‌, ఫిట్స్‌‌‌‌ సహా  కిడ్నీ సంబంధిత వ్యాధులు వెంటాడుతున్నాయి. ఇందులో 30 నుంచి 50 ఏండ్లు వయసు గలవారే అధికంగా ఉన్నారు. వీరితో పాటు మహిళా జైళ్లలో గర్భంతో ఉన్న ఖైదీల ఆరోగ్యం పట్ల జైళ్లశాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. జైలుకు వచ్చే ప్రతి ఖైదీని నిబంధనల ప్రకారం.. ఆరోగ్య పరీక్షలు చేయించిన తర్వాతే జైళ్లలోకి పంపుతారు. 

ఇలా హెల్త్‌‌‌‌ స్క్రీనింగ్‌‌‌‌లో గుర్తించిన జబ్బుల ఆధారంగా వారికి అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. ఈ మేరకు ప్రతి అండర్‌‌‌‌‌‌‌‌ ట్రయల్‌‌‌‌ ఖైదీ సహా శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు సంబంధించి పటిష్టమైన హెల్త్‌‌‌‌ రికార్డులను అధికారులు రూపొందించారు.

సగానికి పైగా బీపీ, షుగర్‌‌‌‌ ఉన్న ఖైదీలే‌‌‌‌

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్లలో  ప్రస్తుతం 5,856  మంది ఖైదీలున్నారు. వీరిలో 2,686 మంది బీపీ, షుగర్‌‌‌‌ రోగులు ఉన్నట్టు జైళ్లశాఖ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక వెల్లడించింది. వీరితో పాటు కిడ్నీలో రాళ్లు, హృదయ సంబంధ వ్యాధులు, హెర్నియా, అపెండిసైటిస్‌‌‌‌, కంటి, చెవు సంబంధ రోగులు ఉన్నట్టు గణాంకాలు తెలిపాయి. వివిధ కారణాలతో గతేడాది మొత్తం 379 మంది ఖైదీలకు సర్జరీలు జరిగాయి.

వీటితో పాటు 17 మంది గర్భిణి ఖైదీలకు జైళ్ల శాఖ విజయంతంగా ఆపరేషన్లు చేయించింది. వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపింది. ఈమేరకు సెంట్రల్‌‌‌‌ జైళ్లు, జిల్లా జైళ్లలో ప్రత్యేకంగా డాక్టర్లను నియమించారు. గుండె ఆపరేషన్లకు అవసరమైన మెడిసిన్స్‌‌‌‌ కోసం అధికారులు గతేడాది రూ.11.59 లక్షలు ఖర్చు చేశారు.
జీవిత ఖైదీల్లోనే ఎక్కువ మంది బాధితులు  

మానసిక ఆందోళన, వ్యక్తిగత శ్రద్ధ లోపించడంతోనూ  కొందరు ఖైదీలు రోగాల బారిన పడుతున్నారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిలో ఎక్కువ మంది బీపీ, షుగర్‌‌‌‌, గుండె సంబంధిత రోగాలతో పాటు చర్మ వ్యాధులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే  ఖైదీల ఆరోగ్య రక్షణ కోసం 13 హెల్త్‌‌‌‌ క్యాంపులు నిర్వహించారు. యోగా తప్పనిసరి చేశారు. ఇతర రోగాలపై అధికారులు శ్రద్ధ పెడుతున్నా.. కొన్ని కనీస సదుపాయాల కోసం గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌‌‌‌కు ఖైదీలను తరలించక తప్పడం లేదు. 

ఏండ్ల తరబడి  జైళ్లలో ఉండే జీవిత ఖైదీలకు షుగర్‌‌‌‌‌‌‌‌ అధికంగా ఉంటోంది. ఈ క్రమంలో ఇద్దరు ఖైదీలకు అధికారులు డయాలసిన్ చేయిస్తున్నారు. ఇలా ఖైదీల ఆరోగ్యానికి సంబంధించి హెల్త్‌‌‌‌ రికార్డులు రూపొందించారు. వ్యాధులకు సంబంధించి వారంలో రెండు రోజుల పాటు హెల్త్‌‌‌‌ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జైల్స్ డీజీ సౌమ్యమిశ్రా వెల్లడించారు.

జైళ్లలో ఖైదీల అనారోగ్య సమస్యలివే..

వ్యాధి    ఖైదీల సంఖ్య

బీపీ    1,225

షుగర్‌‌‌‌    1,461

ఫిట్స్‌‌‌‌     891

డెంటల్‌‌‌‌ చికిత్స    161

కిడ్నీలో రాళ్లు    56 

హార్ట్‌‌‌‌ సర్జరీలు    18

అపెండిసైటిస్‌‌‌‌ ఆపరేషన్లు    05

హెర్నియా ఆపరేషన్లు    20