రాబోయే ఐదు రోజులు (25 వరకు) అతి భారీ వర్షాలు : ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

రాబోయే ఐదు రోజులు (25 వరకు) అతి భారీ వర్షాలు : ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణలో మరో ఐదురోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలోని హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర వెల్లడించింది.  జులై 20వ తేదీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది.  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు,  అత్యంత భారీ నుంచి  అతి భారీ వానలు, భారీ  వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.  ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించారు.  హైదరాబాద్లో మోస్తారు  వర్షంతో పాటు భారీ వర్షం,  అక్కడక్కడ అతి భారీ  వర్షం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. 

ముఖ్యంగా జులై 21వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది.  అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలకు రెడ్ అలర్ట్..భారీ వర్షాలు పడే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

రానున్న రెండు రోజుల పాటు  కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా,  మంచిర్యాల జిల్లా,  జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల్లో  అక్కడక్కడ అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 

అలాగే వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్,  నారాయణపేట,హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ  అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 

మరోవైపు  అదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్,  మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్స్ జారీ చేశారు.