బనకచర్ల డీపీఆర్ టెండర్ను ఆపండి.. కేంద్ర జలశక్తి శాఖకు ఇరిగేషన్ సెక్రటరీ లేఖ

బనకచర్ల డీపీఆర్ టెండర్ను ఆపండి.. కేంద్ర జలశక్తి శాఖకు ఇరిగేషన్ సెక్రటరీ లేఖ
  • కేంద్ర జలశక్తి శాఖకు ఇరిగేషన్​ సెక్రటరీ లేఖ
  • ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్​ డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) టెండర్​ను ఆపాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏపీ ఆ ప్రాజెక్టును నిర్మిస్తు న్నదని.. వెంటనే ఆ ప్రభుత్వ చర్యలను నిలువరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జా.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్​కు లేఖ రాశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇచ్చిందని.. ఏపీ ఏమాత్రం నిబంధనలను పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ వాస్తవ స్వరూపానికి భిన్నంగా.. బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తూ డిజైన్లను మారుస్తున్నదని ఆరోపించారు. పర్యావరణ అనుమతు లు, టెక్నికల్​ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) రూల్స్​ను తుంగలోకి తొక్కుతున్నారని ఆక్షేపించారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు టీవోఆర్​ ఇవ్వకుండా పర్యావరణ శాఖ అడ్డుకున్నదని గుర్తు చేశారు. అసలు ప్రాజెక్ట్​ స్వరూపాన్నే మార్చేశారని.. కొత్త కాంపోనెంట్​ అని పోలవరం ప్రాజెక్ట్​ అథారిటీ (పీపీఏ) కూడా అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. ఇటు సెంట్రల్​ వాటర్​ కమిషన్, నేషనల్​ వాటర్​ డెవలప్​మెంట్​ ఏజెన్సీ వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులు చేపట్టరాదని పేర్కొన్నాయని గుర్తు చేశారు.

కృష్ణా బోర్డు, గోదావరి బోర్డులు కూడా ప్రాజెక్టుకు అభ్యంరతం తెలిపాయని లేఖలో రాహుల్​ బొజ్జా పేర్కొన్నారు. అయినా, ఏపీ వాటని పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నదని ఆయన లేఖలో తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా.. విభజన చట్టానికి తూట్లు పొడిచేలా ఏపీ అక్రమంగా చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్​ చేశారు. టెండర్​, భూసేకరణను నిలిపేయాలని కోరారు.